మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచ‌రుడు మాధ‌వ‌రెడ్డి అరెస్టు

  • మ‌ద‌న‌ప‌ల్లె ద‌స్త్రాల ద‌హ‌నం కేసులో నిందితుడు
  • ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన కుట్ర‌దారుగా అభియోగాలు 
  • నెల రోజులుగా ప‌రారీలో ఉన్న మాధ‌వ‌రెడ్డి
  • చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండ‌లం పెద్ద‌గొట్టిగ‌ల్లు వ‌ద్ద అరెస్టు
ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్‌క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ద‌స్త్రాల ద‌హ‌నం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచ‌రుడు వంక‌రెడ్డి మాధ‌వ‌రెడ్డిని నిన్న సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న నెల రోజులుగా ప‌రారీలో ఉన్నారు. మాధ‌వ‌రెడ్డిని ప‌ట్టుకునేందుకు సీఐడీ అధికారులు నిఘా పెట్టిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. 

చివ‌ర‌కు చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండ‌లం పెద్ద‌గొట్టిగ‌ల్లు వ‌ద్ద త‌న ఫాంహౌస్‌లో ఉన్నార‌నే స‌మాచారంతో సీఐడీ అధికారులు దాడి చేసి ప‌ట్టుకున్నారు. ద‌స్త్రాల ద‌హ‌నం ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన కుట్ర‌దారుగా ఆయ‌న‌పై సీఐడీ అభియోగాలు మోపింది.   

ఆయ‌న పెద్ద‌గొట్టిగ‌ల్లులో క‌ల్యాణ మండ‌పం నిర్మించి అద్దెకు ఇస్తున్నారు. దాంతో క‌ల్యాణ మండ‌పం అద్దెకు కావాలంటూ సీఐడీ డీఎస్పీ కొండ‌య్య నాయుడు బృందం ఆరా తీస్తూ మాధ‌వ‌రెడ్డిని వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు. 

ఆ స‌మ‌యంలో మాధ‌వ‌రెడ్డి త‌న మొబైల్ ఫోన్ల‌ను నీటిలో పారేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా చాక‌చ‌క్యంగా డీఎస్పీ ప‌ట్టుకుని తిరుప‌తి త‌ర‌లించారు. ఆయ‌న నుంచి సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. గ‌తేడాది జులై 21న  జ‌రిగిన రెవెన్యూ ద‌స్త్రాల ద‌హ‌నం ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన కుట్ర‌దారుగా ఇప్ప‌టికే ఆయ‌న‌పై సీఐడీ అభియోగాలు మోపింది.    


More Telugu News