ఏపీలో స్పౌజ్ పింఛ‌న్లు... నేటి నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

  • ఎన్‌టీఆర్ భ‌రోసా కింద పింఛ‌న్ పొందుతున్న భ‌ర్త చ‌నిపోతే భార్య‌కు త‌దుప‌రి నెల నుంచే పింఛ‌న్
  • స్పౌజ్ కేట‌గిరీ కింద కొత్త‌గా 89,788 మందికి పింఛ‌న్లు
  • తాజా నిర్ణ‌యంతో ప్ర‌భుత్వంపై నెల‌కు రూ. 35.91కోట్ల అద‌న‌పు భారం
ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రంలో స్పౌజ్ పింఛ‌న్ల కోసం ఇవాళ్టి నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నుంది. ఈ కేట‌గిరీ కింద కొత్త‌గా 89,788 మందికి పింఛ‌న్లు అందించ‌నుంది. ఎన్‌టీఆర్ భ‌రోసా కింద పింఛ‌న్ పొందుతున్న భ‌ర్త చ‌నిపోతే భార్య‌కు త‌దుప‌రి నెల నుంచే పింఛ‌న్ అందించేలా ఈ కేట‌గిరీని తీసుకొచ్చింది. గ‌తేడాది న‌వంబ‌ర్ నుంచే దీన్ని అమ‌లు చేస్తోంది. ల‌బ్ధిదారుల‌కు రూ. 4వేల చొప్పున ఇస్తోంది. 

అయితే, అంత‌కుముందు 2023 డిసెంబ‌ర్ 1 నుంచి 2024 అక్టోబ‌ర్ 31 మ‌ధ్య ఉన్న ఇదే కేట‌గిరీకి చెందిన అర్హుల‌కూ పింఛ‌న్ అందించాల‌ని గ్రామీణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ (సెర్ప్‌) తాజాగా ఆదేశాలిచ్చింది. అర్హురాలైన మ‌హిళ‌... భ‌ర్త మ‌ర‌ణ ధృవ‌ప‌త్రంతో పాటు త‌న ఆధార్ కార్డు, ఇత‌ర వివ‌రాల‌ను గ్రామ‌, వార్డు సచివాల‌యాల్లో అందించాల్సి ఉంటుంది. శుక్ర‌వారం నుంచే ఈ వివ‌రాలు స్వీక‌రించ‌నున్నారు. 

అర్హులు ఈ నెల 30లోపు ఈ వివ‌రాలు స‌మ‌ర్పిస్తే... మే 1వ తేదీన పింఛ‌న్ డ‌బ్బులు అందుకోవ‌చ్చు. ఆలోపు న‌మోదు చేసుకోలేనివారికి జూన్ 1వ తేదీ నుంచి చెల్లించ‌డం జ‌రుగుతుంది. కాగా, తాజా నిర్ణ‌యంతో ప్ర‌భుత్వంపై నెల‌కు రూ. 35.91కోట్ల అద‌న‌పు భారం ప‌డ‌నుంది. 




More Telugu News