Shehbaz Sharif: పహల్గామ్‌లో ఉగ్రదాడి... భారత్ చర్యలు.. నేడు పాక్ ప్రధాని కీలక భేటీ

- పహల్గామ్‌లో ఉగ్రదాడిలో పాక్ హస్తం అంటూ భారత్ తీవ్ర ఆరోపణలు
- ఈ నేపథ్యంలో దాయాది దేశంపై పలు కఠిన చర్యలు
- పాక్‌తో సింధూ జలాల ఒప్పందం రద్దు
- దీంతో ప్రధాని షెహబాజ్ ఈరోజు ఎన్ఎస్‌సీ అత్యవసర భేటీకి పిలుపు
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది పాకిస్థాన్ హస్తం ఉందంటూ ఆరోపిస్తూ భారత్ పలు కఠిన చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఇందులో పాక్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం ఒకటి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురువారం జాతీయ భద్రతా కమిటీ (NSC) అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు పాక్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన భారత్ తీవ్ర ఆరోపణలను తోసిపుచ్చడంతో పాటు తమపై తీసుకున్న చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సింధు జలాల ఒప్పందం రద్దు, వాఘా-అట్టారి సరిహద్దును మూసివేయడం, పాకిస్థానీయులకు వీసాలను రద్దు చేయడం వంటి భారత్ చర్యలను ఆయన విమర్శించారు. వాటిని "తీవ్రమైనవి, అనుచితమైనవి" అని దార్ పేర్కొన్నారు.
"ఇటీవలి ఉగ్రవాద సంఘటనలతో పాకిస్థాన్‌కు సంబంధం ఉన్న ఎటువంటి ఆధారాలను అందించడంలో భారత్ విఫలమైంది. తాజా ఘటన నేపథ్యంలో కేవలం కోపంతో స్పందించినట్లు కనిపిస్తోంది. భారతదేశం సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా పాక్‌పై నిందలు వేస్తుంది" అని దార్ అన్నారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి కేంద్ర మంత్రివర్గానికి వివరించిన తర్వాత దాయాది దేశంపై తక్షణ చర్యలకు ఉపక్రమించిన్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పాక్ విశ్వసనీయంగా, తిరుగులేని విధంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకునే వరకు 1960 నాటి సింధు జల ఒప్పందం తక్షణమే నిలిపివేయబడుతుందని మిస్రీ వెల్లడించారు.
అంతేకాకుండా, వాఘా-అట్టారి సరిహద్దు క్రాసింగ్‌ను వెంటనే మూసివేస్తామని మిస్రీ ప్రకటించారు. అలాగే పాకిస్థాన్ జాతీయులు ఇండియాకు రాకుండా నిషేధించడంతో పాటు ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లడానికి 48 గంటల సమయం ఇవ్వబడిందని మిస్రీ తెలిపారు.
అంతేగాక న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో ఉన్న వైమానిక దళం, ఆర్మీ, నేవీకి చెందిన పాక్ సైనిక సలహాదారులను దేశం విడిచి వెళ్లడానికి ఒక వారం సమయం ఇస్తున్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి ప్రకటించారు. అలాగే భారత్ కూడా తన ముగ్గురు సైనిక సేవా సలహాదారులను, ఇస్లామాబాద్‌లోని తన హైకమిషన్ నుంచి కనీసం ఐదుగురు సహాయక సిబ్బందిని కూడా వెనక్కి రప్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఇలా పహల్గామ్ ఉగ్రవాద దాడిపై భారత్ తీవ్రంగా స్పందించడంతో పాకిస్థాన్ తన అధికారిక ప్రతిస్పందనను రూపొందించుకుంది. దీనికి ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఎన్ఎస్‌సీ అత్యవసర సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు.