గాయని సునీతకు కౌంటర్.... ప్రవస్తి మరో వీడియో విడుదల

  • 'పాడుతా తీయగా' వివాదంపై గాయని ప్రవస్తి మరో వీడియో విడుదల
  • సింగర్ సునీతకు పలు ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు కోరిన ప్రవస్తి
  • పాటల ఎంపిక, జడ్జిమెంట్ విషయంలో పక్షపాతం జరిగిందని ఆరోపణ
  • కీరవాణి వ్యాఖ్యలు బాధించాయని, తాను డిప్రెషన్‌లో లేనని స్పష్టీకరణ
  • అన్యాయం జరిగిందనే ప్రశ్నిస్తున్నా... సునీతపై ద్వేషం లేదన్న గాయని
గాయని సునీత, నిర్మాత ప్రవీణ ఇచ్చిన వివరణలపై వర్ధమాన గాయని ప్రవస్తి తాజాగా మరో వీడియో ద్వారా స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసిన ఈ వీడియోలో, ఆమె సింగర్ సునీతను ఉద్దేశించి పలు సూటి ప్రశ్నలు సంధించారు, వాటికి సమాధానాలు చెప్పాలని కోరారు.

"సునీత గారు, మీరు రీల్‌లో చక్కగా మాట్లాడారు, అదే నిజ జీవితంలో చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు" అంటూ ప్రవస్తి తన ప్రశ్నలను ప్రారంభించారు. ఛానల్ నిబంధనల మేరకే తాను పాటను ఎంపిక చేసుకుని, రిహార్సల్స్ కూడా పూర్తి చేశాక వద్దన్నారని, కానీ అదే పాటను అదే ఎపిసోడ్‌లో మరో అమ్మాయి పాడితే ప్రోత్సహించారని, ఎందుకిలా చేశారని ఆమె ప్రశ్నించారు. మరోసారి 'కన్యాకుమారి' పాట పాడకముందే జడ్జిమెంట్ ఇచ్చి వెళ్లడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పాట మధ్యలో సాహిత్యం మరచిపోయిన వారు, చేతిపై రాసుకుని వచ్చిన వారు ఫైనల్స్ వరకు ఎలా వెళ్లగలిగారని ఆమె నిలదీశారు.

మ్యాంగో వీడియోలో పాడే అవకాశం సునీత ఇవ్వలేదని, తన గురువు నిహాల్ కొండూరి ద్వారా ఆ అవకాశం వచ్చిందని ప్రవస్తి స్పష్టం చేశారు. అనంతరం తనను సురక్షితంగా ఇంటికి పంపించానని సునీత చెప్పిన దాంట్లో నిజం లేదని, ఆ రోజు తన తల్లి తనతో లేదని పేర్కొన్నారు. పెళ్లిళ్లలో పాడేవారు గాయకులు కారంటూ కీరవాణి చేసిన కొన్ని వ్యాఖ్యలు తనను బాధించాయని, దానిని ప్రస్తావించడంలో తప్పేముందని అన్నారు.

తనకు 19 ఏళ్లని, సంగీతం కోసం చదువు కూడా వదులుకున్నానని, ఐదేళ్ల వయసు నుంచే పోటీల్లో పాల్గొంటున్నానని ప్రవస్తి తెలిపారు. తాను ఎలాంటి డిప్రెషన్‌లో లేనని, అన్యాయం జరిగిందనే ప్రశ్నిస్తున్నానని స్పష్టం చేశారు. సునీతపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని, ఆమె ఎప్పటికీ తన అభిమాన గాయనే అని పేర్కొన్నారు. తాను కొందరి పేర్లు ప్రస్తావించకపోయినా కూడా... ప్రస్తావించినట్లు చెప్పారని ప్రవస్తి అన్నారు.


More Telugu News