Kashmir Terrorist Attack: ఉగ్రదాడికి తీవ్ర నిరసన... నలుపు రంగులో ఫ్రంట్ పేజీలు ప్రచురించిన కశ్మీరీ వార్తాపత్రికలు

Kashmiri Newspapers Protest Terror Attack with Black Front Pages
  • కశ్మీర్ లో నరమేధం
  • ఉగ్రవాద దుశ్చర్యకు 28 మంది బలి
  • నెత్తురోడిన పహల్గామ్
  • ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించిన కశ్మీర్ పత్రికలు
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడికి నిరసనగా అక్కడి ప్రధాన వార్తాపత్రికలు అసాధారణ రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశాయి. బుధవారం నాడు అనేక ప్రముఖ ఆంగ్ల, ఉర్దూ దినపత్రికలు తమ మొదటి పేజీలను నలుపు రంగులో ప్రచురించి, దాడి పట్ల తీవ్ర ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈ దాడిలో అత్యధికులు పర్యాటకులు కాగా, మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు.

ఇటీవలి కాలంలో కశ్మీర్ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడులలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ భయానక ఘటనకు వ్యతిరేకంగా గ్రేటర్ కాశ్మీర్, రైజింగ్ కాశ్మీర్, కాశ్మీర్ ఉజ్మా, ఆఫ్తాబ్, తమీల్ ఇర్షాద్ వంటి ప్రముఖ పత్రికలన్నీ ఏకతాటిపై నిలిచాయి. తమ సంప్రదాయ డిజైన్లను పక్కనపెట్టి, ముఖచిత్రాలను పూర్తిగా నల్ల రంగులోకి మార్చాయి. వార్తల శీర్షికలు, సంపాదకీయాలను తెలుపు, ఎరుపు రంగు అక్షరాలతో ముద్రించాయి. ఇది దాడి బాధితులకు సంఘీభావంగా, ఉగ్రవాద చర్యకు తీవ్ర నిరసనగా నిలిచింది.

"ఘోరం: కాశ్మీర్ చిధ్రం, కాశ్మీరీలు దుఃఖితులు" అనే ప్రధాన శీర్షికను గ్రేటర్ కాశ్మీర్ పత్రిక తన నల్ల ముఖచిత్రంపై తెల్ల అక్షరాలతో ప్రముఖంగా ప్రచురించింది. దాని కింద ఎరుపు రంగులో "పహల్గామ్‌లో భయంకర ఉగ్రదాడిలో 26 మంది మృతి" అని ఉప శీర్షికను ఇచ్చింది.

"పచ్చిక బయళ్లలో ఊచకోత – కశ్మీర్ ఆత్మను రక్షించండి" అనే పేరుతో అదే పత్రిక రాసిన సంపాదకీయం అమాయకుల ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. "భూతల స్వర్గం"గా తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్న జమ్మూ కాశ్మీర్‌పై ఈ సంఘటన చీకటి నీడలను పడేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. 

"ఈ హేయమైన చర్య కేవలం అమాయకులపై దాడి మాత్రమే కాదు, కాశ్మీర్ అస్తిత్వానికి, విలువలైన ఆతిథ్యం, ఆర్థిక వ్యవస్థ, పెళుసుగా ఉన్న శాంతికి ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి. ఈ క్రూరత్వాన్ని కాశ్మీర్ ఆత్మ ముక్తకంఠంతో ఖండిస్తోంది. అందాన్ని చూడటానికి వచ్చి విషాదాన్ని ఎదుర్కొన్న బాధితుల కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తోంది" అని సంపాదకీయం పేర్కొంది.

సుందరమైన బేతాబ్ వ్యాలీ వంటి పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి చేయగలగడం భద్రతా లోపాలను ఎత్తి చూపుతోందని సంపాదకీయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. "పరిమిత ప్రవేశం ఉన్న ప్రదేశంలో ఇంతటి ఉగ్రదాడి జరగడం నిఘా, సమన్వయ లోపాన్ని సూచిస్తోంది. ఇది మేల్కొలుపు కావాలి" అని హెచ్చరించింది.

"కాశ్మీర్ ప్రజలు చాలా కాలంగా హింసను భరిస్తున్నారు, అయినా వారి స్ఫూర్తి చెక్కుచెదరలేదు. ఈ దాడి విభజనకు దారితీయకూడదు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనల్ని ఏకం చేయాలి. దృఢ సంకల్పంతో మాత్రమే మన భూమి భవిష్యత్తును కాపాడుకోగలం" అని పేర్కొంది.
Kashmir Terrorist Attack
Pahalgham Attack
Kashmiri Newspapers
Black Front Pages
Terrorism in Kashmir
India Terrorism
Kashmir Valley Attack
Greater Kashmir Newspaper
Rising Kashmir Newspaper
Tourism in Kashmir

More Telugu News