విజయసాయిరెడ్డిపై అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు

  • తమ పార్టీ నుంచి వెళ్లిపోయి తమపైనే విమర్శలు చేస్తున్నారంటూ విజయసాయిపై అంబటి ఫైర్
  • పీఎస్ఆర్ ఆంజనేయులు, కసిరెడ్డిల అరెస్టులు కక్ష సాధింపేనని విమర్శ
  • టీడీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అరెస్టుల పర్వానికి తెరలేపిందని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తమ పార్టీ నుంచి వెళ్లిపోయి తమపైనే విమర్శలు చేస్తున్న విజయసాయిరెడ్డి వంటి వారిని చూసి భయపడేది లేదని, ఆయన చంద్రబాబు చేతిలోకి వెళ్లారని దుయ్యబట్టారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నిజాయతీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అన్యాయంగా అరెస్ట్ చేశారని అంబటి మండిపడ్డారు. డీజీపీ స్థాయికి వెళ్లాల్సిన అధికారిని ఇలా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. చంద్రబాబును గతంలో అరెస్ట్ చేశారన్న కక్షతోనే ఇప్పుడు పీఎస్ఆర్‌ను అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. అదే విధంగా, రాజ్ కసిరెడ్డిని కేవలం కక్ష సాధింపుతోనే అరెస్ట్ చేశారని అన్నారు. సినీ నటి జత్వాని అరెస్టు చట్ట ప్రకారమే జరిగిందని, ఆమె ఒక బ్లాక్ మెయిలర్ అని, ఈ విషయం ముంబైలో అందరికీ తెలుసని చెప్పారు.

ఈ అరెస్టుల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అంబటి రాంబాబు ఆరోపించారు. లోకేశ్ సృష్టించిన 'ఉర్స్' అనే సంస్థకు రూ. 3 వేల కోట్ల విలువైన ఆస్తులను బదలాయించారని, ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకే పీఎస్ఆర్, కసిరెడ్డిలను అరెస్ట్ చేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. 

రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన సాగుతోందని, శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటారని భావిస్తున్నారా? అని అంబటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసుల విషయంలో న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వానికి సిగ్గులేదని, ఇలాంటి దృష్టి మళ్లించే రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. 

గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 11 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని, దీనికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో హోంమంత్రి, ఇతర అధికారులు లోకేశ్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని అంబటి ఆరోపించారు. ఈ అక్రమ అరెస్టులకు చంద్రబాబు ప్రభుత్వం కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ మూల్యం దేవుడు, ప్రజలు ఏ విధంగా నిర్ణయిస్తారో త్వరలోనే చూస్తారని అన్నారు.


More Telugu News

Ambati Rambabu Vijayasai Reddy Chandrababu Naidu TDP YSRCP Andhra Pradesh Politics PSR Anjaneyulu Raj Kasireddy Arrest Political Controversy