తెలంగాణ ఇంట‌ర్ ఫలితాలు విడుద‌ల‌

  • ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క 
  • ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాల్లో 66.89 శాతం ఉత్తీర్ణ‌త 
  • సెకండియ‌ర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణ‌త
తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్‌ వార్షిక పరీక్షల ఫలితాలు విడుద‌లయ్యాయి. నాంప‌ల్లిలోని ఇంట‌ర్‌ బోర్డు కార్యాల‌యంలో డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్రమార్క ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఇంట‌ర్ ఫ‌లితాల్లో బాలిక‌లు స‌త్తాచాటారు. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఫ‌లితాల్లో 66.89 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. బాలిక‌లు 73.83 శాతం, బాలురు 57.83 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌ల‌కు 4,88,430 మంది హాజ‌రు కాగా 3,22,191 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. 

సెకండియ‌ర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, బాలిక‌లు 74.21 శాతం, బాలురు 57.31 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. సెకండియ‌ర్ ప‌రీక్ష‌ల‌కు 5,08,582 మంది హాజ‌రు కాగా... 3,33,908 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌లితాల కోసం ప్ర‌భుత్వ‌ అధికారిక వెబ్‌సైట్ https://results.cgg.gov.in/ లో చూడోచ్చు. విద్యార్థులు త‌మ హాల్ టికెట్ నంబ‌ర్ ఎంట‌ర్ చేసి, రిజ‌ల్ట్ చూసుకోవ‌చ్చు.  

కాగా, మార్చి 5 నుంచి 25 వ‌ర‌కు 1,532 కేంద్రాల్లో ఇంట‌ర్ వార్షిక పరీక్ష‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఇంట‌ర్ వార్షిక ప‌రీక్ష‌ల‌కు మొత్తం 9.96 ల‌క్ష‌ల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.   


More Telugu News