ఇది అక్ష‌రాల నిజం... ఆయ‌న వల్లే ఐపీఎల్ సాధ్య‌మైంది: ల‌లిత్ మోదీ

  • శ‌ర‌ద్ ప‌వార్ వ‌ల్లే ఐపీఎల్ కార్య‌రూపం దాల్చింద‌న్న లలిత్ మోదీ
  • త‌న‌ను గుడ్డిగా న‌మ్మి ప్రోత్స‌హించ‌డంతోనే ఐపీఎల్ క‌ల నిజ‌మైంద‌ని వ్యాఖ్య‌
  • ప‌వార్ విజ‌న‌రీని మ‌రిచిపోవ‌ద్ద‌న్న లీగ్ ఫౌండ‌ర్
ఎన్‌సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ వ‌ల్లే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఆలోచ‌న కార్య‌రూపం దాల్చింద‌ని లీగ్ ఫౌండ‌ర్ ల‌లిత్ మోదీ అన్నారు. త‌న‌ను గుడ్డిగా న‌మ్మి ప్రోత్స‌హించ‌డంతోనే ఐపీఎల్ క‌ల నిజ‌మైంద‌న్నారు. ప‌వార్ విజ‌న‌రీని మ‌రిచిపోవ‌ద్ద‌ని తెలిపారు. ఇప్పుడు ఐపీఎల్ లేకుండా క్రికెట్ ప్ర‌పంచాన్నే ఊహించ‌లేమ‌న్నారు. 

ఐపీఎల్ రూప‌క‌ల్ప‌న‌లో ప‌వార్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని పేర్కొంటూ ఆంగ్ల ప‌త్రిక‌లో వ‌చ్చిన ఓ వార్తా క‌థ‌నాన్ని ప్ర‌స్తావిస్తూ ల‌లిత్ ఈ విధంగా స్పందించారు. "ఇది అక్ష‌రాల నిజం. శ‌ర‌ద్ ప‌వార్ వ‌ల్లే ఐపీఎల్ సాధ్య‌మైంది. ఆయ‌న నాపై ఉంచిన న‌మ్మ‌కం, వంద శాతం ప్రోత్సాహం కార‌ణంగా ఇవాళ మ‌నం ఐపీఎల్‌ను చూస్తున్నాం. ఈ విష‌యంలో మ‌నమంద‌రం ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. నా క‌ల‌ను ఆయ‌న సాకారం చేశారు. ప‌వార్ దార్శ‌నిక‌త‌ను ఎన్న‌డూ మ‌రిచిపోవ‌ద్దు. ఈ విష‌యంలో ఆయ‌న‌కు సెల్యూట్" అని త‌న సోష‌ల్ మీడియా పోస్టులో ల‌లిత్ మోదీ రాసుకొచ్చారు.   

కాగా, ముంబ‌యిలోని ప్ర‌ఖ్యాత వాంఖ‌డే స్టేడియంలోని ఓ విభాగానికి శ‌ర‌ద్ ప‌వార్ పేరు పెట్టాల‌ని ముంబ‌యి క్రికెట్ అసోసియేష‌న్ (ఎంసీఏ) తీసుకున్న నిర్ణ‌యంపై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఐపీఎల్‌లో శ‌ర‌ద్ ప‌వార్ పాత్ర‌కు సంబంధించి మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఇక‌, ఆయ‌న 2005-08 మ‌ధ్య బీసీసీఐ అధ్య‌క్షుడిగా, 2010-12 మ‌ధ్య ఐసీసీ ప్రెసిడెంట్‌గా ప‌నిచేశారు. అలాగే అనేక ప‌ర్యాయాలు ఎంసీఏకు అధ్య‌క్షుడిగా కూడా ఉన్నారు.   



More Telugu News