అనూహ్య ఘటన... 18 ఏళ్ల త‌ర్వాత కోహ్లీ విష‌యంలో అదే సీన్ రిపీట్‌!

  • బెంగ‌ళూరు వేదికగా ఆర్‌సీబీ, పీబీకేఎస్‌ మధ్య ఐపీఎల్ 34వ‌ మ్యాచ్‌
  • ఈ మ్యాచ్‌లో మూడు బంతులాడి కేవలం ఒక్క ప‌రుగే చేసిన కోహ్లీ
  • 2008 ఏప్రిల్‌ 18న కేకేఆర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఒకే ర‌న్‌కు ఔటైన విరాట్‌
  • యాదృచ్ఛికంగా ఈ రెండు మ్యాచులు ఒకే స్టేడియంలో జ‌రిగిన వైనం
  • ఈ రెండింటీలోనూ ఆర్‌సీబీ ప‌రాజ‌యం
శుక్రవారం బెంగళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదికగా ఆర్‌సీబీ, పీబీకేఎస్‌ మధ్య ఐపీఎల్ 34వ‌ మ్యాచ్‌ జరిగింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అది కూడా బెంగ‌ళూరు స్టార్ ప్లేయ‌ర్‌ విరాట్‌ కోహ్లీ విషయంలో కావడం విశేషం. 18 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సీన్‌ రిపీట్ అయింది. 

అస‌లేం జరిగిందంటే... పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ మూడు బంతులాడి కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. కోహ్లీని చ‌క్క‌టి బంతితో అర్ష్‌దీప్ బోల్తా కొట్టించాడు. అయితే, 18 సంవత్సరాల కిందట 2008 ఏప్రిల్‌ 18న కేకేఆర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా కోహ్లీ ఒక్క ప‌రుగుకే ఔట‌య్యాడు. అప్పుడు ఐదు బంతులు ఎదుర్కొన్న విరాట్ ఒక ర‌న్ చేసి అశోక్ దిండా బౌలింగ్‌లో పెవిలియ‌న్ చేరాడు. 

ఆ మ్యాచ్‌లోనూ బెంగళూరు కేకేఆర్‌ చేతిలో ఓటమిపాలైంది. తొలుత కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 223 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన‌ ఆర్‌సీబీ మాత్రం 82 పరుగులకే కుప్పకూలింది. దాంతో 140 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చ‌విచూసింది. నిన్న‌టి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీ బ్యాట‌ర్లు ఘోరంగా విఫలమయ్యారు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 14ఓవర్లకు కుదించారు.

పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లు చెల‌రేగ‌డంతో బెంగ‌ళూరు బ్యాటర్లు బెంబెలేత్తిపోయారు. వ‌రుస‌గా పెవిలియన్‌కు క్యూకట్టారు. చివ‌రికి 14 ఓవర్లలో 95 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో టిమ్‌ డేవిడ్‌, కెప్టెన్‌ రజత్ పాటీదార్ మాత్ర‌మే రెండు అంకెల స్కోర్ చేశారు. టిమ్‌ డేవిడ్‌ 26 బంతుల్లో అజేయంగా హాఫ్‌ సెంచరీ చేయ‌గా... ర‌జ‌త్‌ 23 పరుగులు చేశాడు. 

ఆ తర్వాత 96 ప‌రుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌ చేసిన పీబీకేఎస్‌ 12.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యాదృచ్ఛికంగా ఈ రెండు మ్యాచులు చిన్న‌స్వామి స్టేడియంలోనే జ‌ర‌గ‌డం... రెండింటీలోనూ ఆర్‌సీబీ ప‌రాజ‌యం పొంద‌డం గ‌మ‌నార్హం.  


More Telugu News