రాజౌరీలో ప్రొఫెసర్‌పై సైనికుల దాడి!

  • వాహనాల తనిఖీ సందర్భంగా దాడి చేశారన్న ప్రొఫెసర్
  • తన కుటుంబం మొత్తం సైన్యంలోనే ఉందని వెల్లడి
  • సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు.. విచారణకు ఆర్మీ ఆదేశం
  • గుర్తుతెలియని సైనికులపై కేసు నమోదు చేసిన పోలీసులు
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో సైనికులు తనపై దాడి చేశారని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ప్రొఫెసర్ లియాఖత్ అలీ ఆరోపించారు. వాహనాల తనిఖీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. అకారణంగా సైనికులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలి ఫిర్యాదుతో గుర్తుతెలియని సైనికులపై నౌషెరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ప్రొఫెసర్ ఆరోపణలపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సైన్యం శుక్రవారం ప్రకటించింది.

ఢిల్లీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ లియాఖత్ అలీ గురువారం రాత్రి రాజౌరి జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం తన బంధువులతో కలిసి కారులో కాలాకోట్‌కు తిరిగి వస్తుండగా లామ్ గ్రామ సమీపంలో వాహన తనిఖీల కోసం సైనికులు ఆపారు. ఈ క్రమంలో తనపై ఎటువంటి కారణం లేకుండానే సైనికులు ఆయుధంతో దాడి చేశారని, తలకు గాయమైందని ప్రొఫెసర్ అలీ ఆరోపించారు. ఈ దాడిలో తనకు దాదాపు ఆరు కుట్లు పడ్డాయని చెప్పారు. తన కుటుంబంలో చాలామంది సైన్యంలోనే ఉన్నారని, అయినా ఇలా జరగడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సంఘటనపై సైన్యం స్పందించింది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి నిర్దిష్ట సమాచారం ఉండటంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ వాహనం ఆపినప్పుడు సైనికుల నుంచి ఆయుధం లాక్కోవడానికి ఆయన ప్రయత్నించారని పేర్కొంది. దీంతో ఘర్షణ జరిగిందని ప్రాథమిక సమాచారం అందినట్లు ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయినప్పటికీ, ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని, తమ సిబ్బంది ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.


More Telugu News

Rajouri Attack Indian Army Jammu and Kashmir Liyaqat Ali IGNOU Professor Army Assault Vehicle Check Military Investigation Professor Attacked Kashmir Conflict