భార్యాభర్తల గొడవ.. మధ్యవర్తిగా వెళ్లిన వ్యక్తి దుస్తులు విప్పించి రోడ్డుపై నగ్నంగా...

  • హైదరాబాద్ శివారులోని పేట్ బషీరాబాద్‌లో ఘటన
  • విడాకుల వరకు వెళ్లిన జంటను కలిపేందుకు వెళ్లిన తరుణ్‌కుమార్
  • స్నేహితులతో కలిసి దాడిచేసిన స్నేహితురాలి భర్త
  • ఆపై కాళ్లు నాకించుకున్న వైనం
  • పరారీలో నిందితులు
భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంలో మధ్యవర్తిగా మాట్లాడేందుకు వెళ్లిన పాపానికి అతడికి దారుణ పరాభవం ఎదురైంది. దారుణంగా కొట్టి, దుస్తులు విప్పించి రోడ్డుపై నగ్నంగా నిలబెట్టారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి అతడి స్నేహితులకు పంపి వైరల్ చేశారు. గత నెలలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.  హైదరాబాద్ శివారులోని పేట్ బషీరాబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన అనీషా, వినీత అక్కాచెల్లెళ్లు. వినీతకు గుండ్లపోచంపల్లికి చెందిన కిరణ్‌యాదవ్‌తో వివాహం జరిగింది. అయితే, భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి గొడవలు జరుగుతుండటంతో వినీత విడాకుల కోసం సికింద్రాబాద్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించి భర్తకు నోటీసులు పంపింది. అయితే, ఆ తర్వాత ఏమైందో కానీ, మనసు మార్చుకుని భర్తతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని సోదరి అనీషాకు చెప్పి తాము కలిసి ఉండే మార్గం చెప్పాలని కోరింది.

దీంతో  తమ కుటుంబ స్నేహితుడైన అఫ్జల్‌గంజ్‌ ఉస్మాన్‌షాహీకి చెందిన తరుణ్‌కుమార్‌కు విషయం చెప్పిన అనీషా.. మధ్యవర్తిత్వం వహించి వారిద్దరినీ కలపాల్సిందిగా కోరింది. కిరణ్ తనకు తెలిసిన వ్యక్తే కావడంతో తరుణ్ అందుకు అంగీకరించాడు. గత నెల 26న గుండ్లపోచంపల్లిలోని కిరణ్ ఇంటికి వెళ్లిన తరుణ్ అతడితో మాట్లాడే ప్రయత్నం చేశాడు. తరుణ్‌ను చూడగానే కోపంతో ఊగిపోయిన కిరణ్.. తన వద్దకు ఎందుకు వచ్చావంటూ స్నేహితులు బోయిన్‌పల్లికి చెందిన జయంత్‌యాదవ్‌, సుచిత్రకు చెందిన సోహెల్‌, అంగడిపేటకు చెందిన తరుణ్‌గౌడ్‌, గుండ్లపోచంపల్లికి చెందిన పవన్‌లతో కలసి అతడిపై దాడిచేశాడు. 

పదునైన ఆయుధాలతో తరుణ్‌కుమార్‌పై విచక్షణ రహితంగా దాడిచేశాడు. అంతేకాదు, దుస్తులు విప్పించి నగ్నంగా రోడ్డుపై నిలబెట్టి కులం పేరుతో దూషించారు. తరుణ్‌తో కిరణ్ తన కాళ్లు నాకించుకున్నాడు. ఈ మొత్తం ఘటనను తన సెల్‌ఫోన్‌‌లో చిత్రీకరించి ఆ వీడియోలను తరుణ్ స్నేహితులకు పంపాడు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న తరుణ్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాడు. కోలుకున్న తర్వాత ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.


More Telugu News