కిందపడేసి తొక్కినా పగలని ట్యాబ్... తయారైంది మనదేశంలోనే!

  • వీవీడీఎన్ టెక్నాలజీస్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
  • దేశీయంగా తయారైన ట్యాబ్ మన్నికపై ప్రత్యక్ష పరీక్ష
  • కింద పడేసి, దానిపై నిలబడి నాణ్యత పరిశీలన
  • 'ఇది పగలదు' అంటూ 'ఎక్స్' లో పోస్ట్ చేసిన అశ్విని వైష్ణవ్
దేశీయంగా తయారైన ట్యాబ్ ఎంత దృఢంగా ఉందో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా పరీక్షించి చూపించారు. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వీవీడీఎన్ టెక్నాలజీస్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ ఉత్పత్తి నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వీవీడీఎన్ టెక్నాలజీస్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ తయారవుతున్న వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో, దేశీయంగా అభివృద్ధి చేసిన ఒక ట్యాబ్ గురించి అధికారులు మంత్రికి వివరించారు. ఆ ట్యాబ్ అత్యంత మన్నికైనదని, కింద పడినా లేదా దానిపై నిలబడినా కూడా ఎలాంటి నష్టం జరగదని వారు తెలిపారు.

అధికారులు చెప్పిన మాటలను నిర్ధారించుకునేందుకు, మంత్రి వైష్ణవ్ స్వయంగా ఆ ట్యాబ్‌ను కొంత ఎత్తు నుంచి నేలపై పడేసి చూశారు. ఆ తర్వాత, దానిపై తానే నిలబడి దాని పటిష్టతను పరీక్షించారు. ఈ పరీక్షలో ట్యాబ్ చెక్కుచెదరకుండా ఉండటం గమనార్హం.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను మంత్రి అశ్విని వైష్ణవ్ తన అధికారిక 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. "ఇది పగలదు" (It doesn’t break) అనే చిన్న వ్యాఖ్యను దానికి జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

వీవీడీఎన్ టెక్నాలజీస్ పర్యటనలో భాగంగా, అదే కేంద్రంలో పూర్తిగా భారత్‌లోనే రూపొందించిన 'అడిపోలి' అనే ఏఐ (కృత్రిమ మేధ) సర్వర్‌ను కూడా మంత్రి వైష్ణవ్ పరిశీలించారు. 


More Telugu News