వివాదంలో 'జాట్'... హీరో స‌న్నీ డియోల్‌, ర‌ణ్‌దీప్ హూడాపై కేసు న‌మోదు!

  • సినిమాలోని ఓ స‌న్నివేశంలో మ‌త‌ప‌ర‌మైన మ‌నోభావాల‌ను దెబ్బతీశారనే ఆరోపణలు
  • హీరోతో పాటు ప‌లువురిపై కేసు న‌మోదు చేసిన‌ జ‌లంధ‌ర్ పోలీసులు 
  • భార‌తీయ న్యాయ సంహిత‌లోని సెక్ష‌న్ 299 ప్ర‌కారం కేసు న‌మోదు
  • 'జాట్‌'ను తెర‌కెక్కించిన టాలీవుడ్ డైరెక్ట‌ర్ గోపిచంద్ మ‌లినేని
బాలీవుడ్ సీనియ‌ర్‌ హీరో స‌న్నీ డియోల్ న‌టించిన తాజా చిత్రం 'జాట్' వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీలో న‌టించిన స‌న్నీ డియోల్‌తో పాటు ర‌ణ్‌దీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్‌పై కేసు న‌మోదైంది. జాట్ సినిమాలోని ఓ స‌న్నివేశంలో మ‌త‌ప‌ర‌మైన మ‌నోభావాల‌ను దెబ్బతీశారనే ఆరోపణలపై తాజాగా జ‌లంధ‌ర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ చిత్రాన్ని టాలీవుడ్ ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న‌తో పాటు నిర్మాత‌ల‌పైన కూడా కేసు పెట్టారు. భార‌తీయ న్యాయ సంహిత‌లోని సెక్ష‌న్ 299 ప్ర‌కారం కేసు న‌మోదైన‌ట్లు స‌మాచారం.

ఇక‌, ఏప్రిల్ 10న విడుద‌లైన‌ జాట్ చిత్రంలో క్రైస్త‌వు మ‌నోభావాలు దెబ్బ‌తీసే రీతిలో ఓ స‌న్నివేశం ఉన్న‌ట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు. యేసు క్రీస్తును అగౌర‌వ‌ప‌రుస్తున్న రీతిలో సీన్ ఉన్న‌ట్లు ఆయన ఆరోపించారు. గుడ్ ఫ్రైడే, ఈస్ట‌ర్ ప‌ర్వ‌దినాలు ఉన్న ఈ ప‌విత్ర మాసంలో కావాల‌నే ఈ మూవీని విడుద‌ల‌ చేశార‌ని, క్రైస్త‌వుల్లో ఆగ్ర‌హాన్ని తెప్పించి, దేశంలో అల్ల‌ర్లు సృష్టించే ప్ర‌య‌త్నం చేశార‌ని, అందుకే ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, ర‌చ‌యిత‌పై కేసు పెట్టిన‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇక ఈ యాక్షన్ చిత్రంలో వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా, ప్రశాంత్ బజాజ్, జరీనా వహాబ్, ర‌మ్య‌కృష్ణ‌, జగపతి బాబు వంటి భారీ తారాగణం న‌టించారు. రణదీప్ హుడా ప్రతినాయకుడిగా క‌నిపించారు. టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదలైంది. మొదటి వారాంతంలో బాక్సాఫీస్ వద్ద రూ. 32 కోట్లకు పైగా వసూళ్లు రాబ‌ట్టింది. 


More Telugu News