టెక్సాస్ రోడ్డు ప్ర‌మాదంలో తెలుగు విద్యార్థిని మృతి!

  • కొన్నాళ్ల క్రితం ఎంఎస్ కోసం టెక్సాస్ వెళ్లిన గుంటూరు జిల్లా వాసి దీప్తి 
  • ఈ నెల 12న త‌న స్నేహితురాలితో క‌లిసి న‌డిచి వెళ్తున్న క్ర‌మంలో రోడ్డుప్ర‌మాదం
  • దీప్తి త‌ల‌కు తీవ్ర గాయాలు కావ‌డంతో ఆసుప‌త్రిలో చికిత్స‌
  • ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 15న మృతి 
అమెరికాలోని టెక్సాస్‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఏపీలోని గుంటూరు జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్‌కు చెందిన వంగ‌వోలు దీప్తి మృతి చెందారు. కొన్నాళ్ల క్రితం ఆమె టెక్సాస్‌లోని డెంట‌న్ న‌గ‌రంలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. ఈ నెల 12న త‌న స్నేహితురాలు మేడికొండూరుకు చెందిన స్నిగ్ధ‌తో క‌లిసి రోడ్డుపై న‌డిచి వెళ్తున్న స‌మ‌యంలో వారిని వేగంగా వ‌చ్చిన ఓ కారు బ‌లంగా ఢీకొట్టింది. 

ఈ ప్ర‌మాదంలో దీప్తి త‌ల‌కు తీవ్ర గాయం కాగా, స్నిగ్ధ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డింది. దాంతో వారిని చికిత్స కోసం ఆసుప‌త్రిలో చేర్పించారు. దీప్తి స్నేహితురాళ్లు ఈ ప్రమాదం గురించి ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. ఆయన గుంటూరులోని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ క్యాంప్‌ ఆఫీసులో సంప్రదించగా... సమాచారాన్ని అమెరికాలో ఉన్న పెమ్మసానికి తెలియజేశారు.

వెంటనే పెమ్మసాని తన బృందాన్ని అప్రమత్తం చేసి మెరుగైన చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. గుంటూరులో ఉన్న పెమ్మసాని సోదరుడు రవిశంకర్‌ తన స్నేహితుడు నవీన్‌ కు క్రౌడ్‌ ఫండింగ్‌ వచ్చేలా చూడాలని సూచించారు.

దాంతో ఆన్‌ లైన్‌ లో విరాళాల రూపంలో 80వేల‌ డాలర్ల వరకు రావ‌డంతో ఆ డ‌బ్బును చికిత్సకు వినియోగించారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చనిపోయింది. శనివారానికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈమేరకు ఏర్పాట్లు చేసినట్లు పెమ్మసాని రవిశంకర్‌ తెలిపారు.

కాగా, దీప్తి తండ్రి హనుమంతరావు చిరు వ్యాపారి. ఆమె సోదరి శ్రీలక్ష్మి ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 10న దీప్తితో ఫోన్‌ లో మాట్లాడానని కాలేజీకి వెళ్లాలని చెప్పడంతో ఆదివారం మాట్లాడతానని చెప్పిందని, అవే నాతో మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విల‌పించింది.

చదువులో ఎప్పుడూ ముందుండేదని, పదో తరగతి , ఇంటర్‌ ఇంజినీరింగ్‌ లో టాపర్‌ గా నిలిచిందని, అందుకే కొంత పొలం అమ్మి అమెరికా పంపినట్లు దీప్తి పేరెంట్స్ చెప్పారు. కోర్సు పూర్తయ్యి గ్రాడ్యుయేషన్‌ పట్టా తీసుకునే సమయానికి మమ్మల్ని కూడా అమెరికా రావాలని కోరగా... ఆ ఏర్పాట్లలో ఉన్నామ‌ని చెప్పారు. ఇంత‌లోనే ఈ ఘోరం జ‌రిగిపోయింద‌ని వారు గుండెలవిసెలా రోధిస్తున్నారు.


More Telugu News