Pawan Kalyan: ఆ గ్రామంలోని అందరికీ పాదరక్షలు పంపిన డిప్యూటీ సీఎం పవన్.. కారణమిదే!

- ఈ నెల 7న మన్యం జిల్లా ఆదివాసీ గ్రామం పెదపాడులో పర్యటించిన పవన్
- నడుచుకుంటూ వచ్చి పవన్‌కు స్వాగతం పలికిన పాంగి మిత్తు అనే వృద్ధురాలు
- ఆ సమయంలో ఆమె కాళ్లకు చెప్పులు లేకపోవడం చూసి చలించిపోయిన వైనం
- దాంతో గురువారం గ్రామంలోని 345 మందికి పాదరక్షలు పంపిన డిప్యూటీ సీఎం
అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ నెల 7వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం ఆదివాసీ గ్రామం పెదపాడులో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పాంగి మిత్తు అనే వృద్ధురాలు నడుచుకుంటూ వచ్చి పవన్‌కు స్వాగతం పలికారు. ఆమె కాళ్లకు చెప్పులు లేకున్నా నడిచి వచ్చి తనకు స్వాగతం పలకడం చూసిన డిప్యూటీ సీఎం చలించిపోయారు.
దాంతో వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి... గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారు, వారికి ఏ సైజు చెప్పులు అవసరమో సర్వే చేయించారు. గురువారం ఆయన కార్యాలయ సిబ్బందితో 345 మందికి పాదరక్షలు పంపారు. నిన్న రాత్రి పెదపాడు గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి డిప్యూటీ సీఎం కార్యాలయం సిబ్బంది బోయిపల్లి పవన్‌తో పాటు బృంద సభ్యులు, స్థానిక గ్రామ సర్పంచ్ వెంకటరావు వాటిని పంపిణీ చేశారు. దీంతో తమ కష్టం తెలుసుకుని, దాన్ని తీర్చినందుకు గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తూ, పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త చెప్పులు వేసుకుని గిరిజన మహిళలు చిరునవ్వులు చిందించారు.