Telangana High Court: పాతబస్తీ మెట్రో పనులపై హైకోర్టు కీలక సూచనలు

Telangana High Courts Crucial Directives on Old City Metro Project
  • చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా చూడాలన్న హైకోర్టు
  • పురావస్తు శాఖ గుర్తించిన కట్టడాల వద్ద పనులు చేపట్టకూడదన్న హైకోర్టు
  • తదుపరి విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా
పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణం కారణంగా చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఈ ప్రాంతంలో మెట్రో నిర్మాణ పనులకు సంబంధించి యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని ఆ ఫౌండేషన్ పిటిషన్‌లో పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) వాదనలు వినిపించారు. పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు తెలియజేశారు. చారిత్రక కట్టడాలను కూల్చివేయడం లేదని స్పష్టం చేశారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే స్థలాలను సేకరించి నిర్మాణాలు చేపడతామని పేర్కొన్నారు. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి సమయం కావాలని ఏఏజీ కోరారు.

మెట్రో నిర్మాణ పనుల్లో భాగంగా చారిత్రక కట్టడాలకు ఎటువంటి నష్టం వాటిల్లకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. పురావస్తు శాఖ గుర్తించిన కట్టడాల వద్ద పనులు చేపట్టరాదని ఆదేశించింది. ఈ నెల 22వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.
Telangana High Court
Hyderabad Metro
Old City Hyderabad
Historical Buildings
Act for Public Welfare Foundation
Metro Construction
Archaeological Survey of India
Public Interest Litigation
Heritage Conservation
Government of Telangana

More Telugu News