తమిళ సూపర్ స్టార్ విజయ్‌పై సున్నీ ముస్లిం బోర్డు ఫత్వా

  • ఫత్వా జారీచేసిన బరేలీ సున్నీ ముస్లిం బోర్డు
  • ఇఫ్తార్ విందుకు మద్యం ప్రియులు, సంఘ విద్రోహులను ఆహ్వానించారని ఆగ్రహం
  • ఆయన గత చరిత్ర మొత్తం ముస్లిం వ్యతిరేకి అని చెప్తుందన్న మౌలానా షాబుద్దీన్
  • ఆయన సినిమాల్లో ముస్లింలను ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా చూపించారని మండిపాటు
  • ఇప్పుడు ఓట్ల కోసం ముస్లింలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు దళపతి విజయ్‌పై ఉత్తరప్రదేశ్‌ బరేలీలోని సున్నీ ముస్లిం బోర్డు ఫత్వా జారీచేసింది. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు, చష్మీ దారుల్ ఇఫ్తా చీఫ్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేలీ విజయ్‌పై ఫత్వా జారీచేశారు. విజయ్ గత చర్యలు ఆయనను ఇస్లాం వ్యతిరేకిగా చూపిస్తున్నాయని అందులో పేర్కొన్నారు. ఇఫ్తార్ విందుకు మద్యం తాగే వారిని, జూదగాళ్లను ఆహ్వానించడం నేరమే కాకుండా పాపమని పేర్కొన్న బోర్డు.. ఇలాంటి వ్యక్తులను నమ్మవద్దని, మత పరమైన కార్యకలాపాలకు అటువంటి వారిని ఆహ్వానించవద్దని తమిళనాడు ముస్లింలను కోరింది. 

సినిమాల ద్వారా రాజకీయాల్లోకి వచ్చేందుకు విజయ్ దళపతి ముస్లిం సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటున్నాడని మౌలానా రజ్వీ ఆరోపించారు. విజయ్ చరిత్ర చూస్తే ఆయన ముస్లిం వ్యతిరేకి అన్న విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. ‘ది బీస్ట్’ సినిమాలో ముస్లింలను, మొత్తం ముస్లిం సమాజాన్ని ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సినిమాలో ముస్లింలను రాక్షసులు, దెయ్యాలుగా చూపించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడేమో రాజకీయాల్లోకి వచ్చి ఓట్ల కోసం ముస్లింలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇఫ్తార్‌కు మద్యం ప్రియులు, సంఘ విద్రోహులను పిలిచి రంజాన్ పవిత్రతను విజయ్ దెబ్బతీశాడని, వీరు ఉపవాసం ఉండరని, ఇస్లాంను పాటించరని రజ్వీ పేర్కొన్నారు. కాబట్టి తమిళనాడులోని సున్నీ ముస్లింలు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ముస్లింలు విజయ్‌కు దూరంగా ఉండాలని, ఆయన కార్యక్రమాలకు హాజరు కావొద్దని, మతపరమైన కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించవద్దని రజ్వీ కోరారు. 


More Telugu News