Dr. Arvind Panagariya: నిధుల వాటా పంపిణీకి రాష్ట్రాలతో విస్తృత సంప్రదింపులు: 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ డా. అరవింద్ పనగారియా

- విజయవాడ నోవాటెల్ లో మీడియాతో మాట్లాడిన డా. అరవింద్ పనగారియా
- ఏపీ సీఎం చంద్రబాబు దార్శినికుడు అంటూ ప్రశంస
- ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎదురయ్యే సవాళ్లను కమిషన్ పరిశీలిస్తుందని వెల్లడి
అయిదేళ్లకోసారి ఏర్పాటయ్యే ఆర్థిక సంఘం భారత రాజ్యాంగం నిర్దేశించిన విధులను నిర్వర్తిస్తోందని, కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడిలో రాష్ట్రాలకు ఏ విధంగా పంపిణీ చేయాలనే దానిపై సిఫార్సులు చేస్తుందని 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ డా. అరవింద్ పనగారియా అన్నారు.
బుధవారం ఆయన విజయవాడ నోవాటెల్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిధుల వాటా పంపిణీకి సంబంధించి సిఫార్సులు చేసేందుకు వీలుగా రాష్ట్రాలతో విస్తృత సంప్రదింపులతో పాటు వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో ఇప్పటికే 22 రాష్ట్రాల్లో పర్యటించడం జరిగిందని, 23వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఇంకా అయిదు రాష్ట్రాలు మిగిలి ఉన్నాయన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును పనగారియా ప్రశంసించారు. ఆయన దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం ప్రారంభం నుండి ప్రణాళికాబద్ధమైన రాజధాని నగరం, దాని చరిత్ర గురించి అద్భుతమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఏవీ ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌కు నాయకత్వం వహిస్తున్న సమయంలో భీమ్ అప్లికేషన్, యూపీఐ వ్యవస్థ అభివృద్ధికి దారి తీసిన డిజిటలైజేషన్‌పై కమిటీకి అధ్యక్షత వహించినప్పుడు, 2015 నుండి నీతి ఆయోగ్‌లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రితో తనకున్న అనుబంధాన్ని పనాగరియా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి క్రియాశీల, ఆచరణాత్మక నాయకత్వాన్ని పనగారియా ప్రశంసించారు.
వచ్చే 20-25 సంవత్సరాలలో భారతదేశం ఎలా ఉండబోతోందో, 2047 వికసిత్ భారత్ దార్శనికత గురించి మరియు స్వర్ణాంధ్ర 2047 దార్శనికతను వివరించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై విభజన ప్రభావం, వనరుల లభ్యత, భవిష్యత్తు అవసరాలను ముఖ్యమంత్రి తన ప్రజెంటేషన్‌లో కవర్ చేశారని తెలిపారు. ఆర్థిక సంఘం వర్టికల్ డెవల్యూషన్ వాటా ప్రస్తుతం ఉన్న 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎదురయ్యే సవాళ్లను కమిషన్ పరిశీలిస్తుందన్నారు.
ఇప్పటి వరకు ఆర్థిక సంఘం ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదని, విస్తృత సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇంకా చాలా చర్చలు జరగాల్సి ఉందని తెలిపారు. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి ప్రత్యేకత గురించి పనాగరియా వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి ఎటువంటి షరతులు విధించకపోవడం ఇదే మొదటిసారి అని అన్నారు. పన్నుల వాటాపై సిఫార్సులు చేయడంలో ఆర్థిక సంఘానికి పూర్తిస్థాయిలో స్వాతంత్ర్యం ఇవ్వడం జరిగిందన్నారు.
భవిష్యత్ సిఫార్సులకు సంబంధించి రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను అంగీకరిస్తూ ఛైర్మన్ సానుకూలతను వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా విస్తృత సంప్రదింపులు, భాగస్వామ్య పక్షాలతో చర్చలు పూర్తి చేసిన తర్వాతే ఆర్థిక సంఘం సిఫార్సుల నివేదికను సమర్పిస్తుందని తెలిపారు. సమావేశంలో ఆర్థిక సంఘం సభ్యులు డా. మనోజ్ పాండా, అన్నే జార్జ్ మాథ్యూ, రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు.