Kandula Durga Prasad: ఈ ఏడాది నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు: ఏపీ మంత్రి కందుల దుర్గేశ్

- కళలు, కళాకారులకు మంచి రోజులు వచ్చాయన్న మంత్రి
- రాష్ట్రంలో కళలు, సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరిస్తామని హామీ
- 110 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులకు రాష్ట్ర, జిల్లా స్థాయి కందుకూరి పురస్కారాలు అందజేత
కూటమి ప్రభుత్వంలో కళలు, కళాకారులకు మంచి రోజులు వచ్చాయని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. బుధవారం విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు నాటక రంగ దినోత్సవం-2025 ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా నాటక రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 110 మంది కళాకారులకు మంత్రి దుర్గేశ్ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో ముగ్గురికి కందుకూరి ప్రతిష్ఠాత్మక రంగస్థల పురస్కారాలు, జిల్లా స్థాయిలో 107 మందికి కందుకూరి విశిష్ట పురస్కారాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు ఈ ఏడాది తప్పకుండా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పౌరాణిక, పద్య నాటకాలకు నేటికీ ఆదరణ ఉందని, ఆధునిక నాటకాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.
యువత నాటక రంగంపై మక్కువ పెంచుకోవాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో కళలను ప్రజా బహుళ్యంలోకి తీసుకువెళతామని తెలిపారు. వీరేశలింగం పంతులు నడిచిన బాట భావితరాలకు వెలుగుబాట అని తెలుపుతూ ఆయన జయంతిని తెలుగు నాటకరంగ దినోత్సవంగా జరుపుకోవడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అని అన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ సినీ రచయిత, కందుకూరి పురస్కారాల ఎంపిక కమిటీ చైర్మన్ బుర్రా సాయి మాధవ్, ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు శుక్లా తదితరులు పాల్గొన్నారు.