Accidental Attack: సొంత పౌరులపై ఇజ్రాయెల్ బాంబు దాడి.. పొరపాటు జరిగిందన్న ఐడీఎఫ్

- గాజా సరిహద్దుకు రెండు మైళ్ల దూరంలో పడిన బాంబు
- టెక్నికల్ మాల్ ఫంక్షన్ వల్లేనని సైన్యం ప్రకటన
- ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని వివరణ
గాజా స్ట్రిప్ లోని హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. హమాస్ ను తుడిచిపెట్టడమే తమ లక్ష్యమని, అప్పటి వరకు గాజాపై దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో బుధవారం గాజా స్ట్రిప్ పై దాడికి బయలుదేరిన ఓ ఫైటర్ జెట్ పొరపాటున ఇజ్రాయెల్ భూభాగంపైనే బాంబు జారవిడిచింది. సదరన్ గాజా సరిహద్దుకు రెండు మైళ్ల ఇవతల నిర్ యిత్ఝాక్ అనే ప్రాంతంలో క్షిపణి దాడి జరిగింది.
అయితే, ఈ క్షిపణి మైదాన ప్రాంతంలో పడటంతో ప్రాణనష్టం తప్పిందని, పౌరులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఓ ప్రకటనలో తెలిపింది. టెక్నికల్ మాల్ ఫంక్షన్ వల్లే ఈ పొరపాటు చోటుచేసుకుందని వివరణ ఇచ్చింది. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. నిర్ యిత్ఝాక్ ప్రాంతంలో సుమారు 550 మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రధాని నెతన్యాహు నార్తరన్ గాజాలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ పొరపాటు జరగడం గమనార్హం.