కేకేఆర్‌పై అదిరే విజయం తర్వాత చాహల్‌ను హత్తుకున్న నటి ప్రీతి జింటా.. వీడియో ఇదిగో!

  • 112 పరుగులు ఛేదించలేకపోయిన కోల్‌కతా
  • 95 పరుగులకే కేకేఆర్ ఆలౌట్
  • నాలుగు వికెట్లు తీసి కేకేఆర్ పతనాన్ని శాసించిన చాహల్
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఊహించని విజయం తర్వాత సంతోషం పట్టలేకపోయిన ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా.. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను హత్తుకుంది. ఈ మ్యాచ్‌లో 112 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా చాహల్ దెబ్బకు కుప్పకూలింది. పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం కొనసాగిన ఈ మ్యాచ్‌లో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టి కోల్‌కతా పరాజయాన్ని శాసించాడు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన కోల్‌కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయింది. 

ఈ మ్యాచ్‌కు ముందు వరకు రెండు వికెట్లు మాత్రమే పడగొట్టిన చాహల్.. కోల్‌కతాతో మ్యాచ్‌లో 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఒకానొక సమయంలో 9 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళ్తున్నట్టు కనిపించిన కోల్‌కతా.. 15.1 ఓవర్లలో 95 పరుగులకు ఆలౌట్ అయింది. 

అనూహ్యంగా అందిన విజయంతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రీతి జింటా సంతోషం పట్టలేకపోయింది. చాహల్‌‌ను హత్తుకుని తన సంతోషాన్ని పంచుకుంది. చాహల్‌తో కాసేపు ముచ్చటించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


More Telugu News