Kotha Prabhakar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యల వెనుక కేసీఆర్: పీసీసీ చీఫ్

- ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ నేతలు
- కేసీఆర్, కేటీఆర్ సూచనలతోనే అలా వ్యాఖ్యానించారని ఆగ్రహం
- ప్రభాకర్‌రెడ్డి దిష్టిబొమ్ము దహనం
- పోలీసులకు ఫిర్యాదులు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు తమను కోరుతున్నారన్న దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యల వెనక కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రగా భావిస్తున్నామని కాంగ్రెస్ నేతలు, మంత్రులు మండిపడ్డారు. విచారణ జరిపి చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తామని పేర్కొన్నారు
కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏమైనా సంతలో వస్తువులా? అని మహేశ్‌కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చోటా, మోటా కాంట్రాక్టర్లు కూల్చితే కూలే ప్రభుత్వం కాదని, ఇలాంటి వాటికి భయపడబోమని తేల్చి చెప్పారు. ప్రజల నుంచి తమకు సంపూర్ణ మద్దతు ఉందన్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్ ఆత్మ అని, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ సూచనలతోనే ప్రభాకర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై తొలి నుంచీ కుట్రలు జరుగుతూనే ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభాకర్ రెడ్డి ఈ మధ్య జ్యోతిష్యం కూడా చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆందోళన
దుబ్బాక ఎమ్మెల్యే వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన సొంత నియోజకవర్గం దుబ్బాకలోని తొగుటలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభాకర్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేయాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చేగుంటలోనూ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయపోల్‌లో ప్రభాకర్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి విచారించాలని టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లోని బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.