Kaleshwaram Saraswati Pushkaralu: కాళేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు... వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రులు

- వెబ్‌సైట్, మొబైల్ యాప్, పోస్టర్‌ను ఆవిష్కరించిన కొండా సురేఖ, శ్రీధర్ బాబు
- నిత్యం 50 వేల నుంచి లక్ష మంది భక్తులు వస్తారని అంచనా
- పుష్కరాల కోసం ప్రభుత్వం రూ. 35 కోట్లు కేటాయించిందన్న మంత్రులు
తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15వ తేదీ నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్, మొబైల్ యాప్, పోస్టర్‌లను మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఈ ఇద్దరు మంత్రులు పర్యవేక్షిస్తున్నారు.
పుష్కరాల సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు తెలిపారు. పన్నెండు రోజుల పాటు జరగనున్న ఈ పుష్కరాలకు నిత్యం 50 వేల నుంచి లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా భక్తులు వస్తారని తెలిపారు.
కాళేశ్వరంలో 17 అడుగుల ఏకశిల రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యం కోసం ఆలయ పరిసరాల్లో టెంట్ సిటీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 35 కోట్లు కేటాయించిందని అన్నారు.