Nara Lokesh: ప్రభుత్వ కాలేజీల్లో చదివితే మార్కులు రావనే అపోహను మీరు చెరిపేశారు: మంత్రి నారా లోకేశ్

- ఇటీవల ఇంటర్ రిజల్ట్స్ విడుదల
- ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన ఫలితాలు
- ఉండవల్లి నివాసంలో షైనింగ్ స్టార్స్-2025 కార్యక్రమం
- 52 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ల్యాప్ టాప్స్ బహూకరించిన లోకేశ్
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి ఇంటర్మీడియట్‌లో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివితే మంచి మార్కులు రావనే అపోహను తొలగించి, ప్రభుత్వ విద్య గౌరవాన్ని నిలిపారని ఆయన విద్యార్థులను ప్రశంసించారు. ఉండవల్లిలోని తన నివాసంలో 'షైనింగ్ స్టార్స్-2025' పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 52 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా వారికి బంగారు పతకాలు (గోల్డ్ మెడల్స్) అందించి, ల్యాప్‌టాప్‌లను బహూకరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, విద్యార్థుల విజయానందాన్ని పంచుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. "మీరంతా విజేతలు, మీకు నా హ్యాట్సాఫ్. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేశారు. మీ అందరితో ఇలా కూర్చోవడం నా అదృష్టం. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నా" అంటూ ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని' పునరుద్ధరించడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులకు భారం తగ్గిందని మంత్రి గుర్తుచేశారు. తాను పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో కష్టపడి చదివానని, స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ చేసి, ప్రపంచ బ్యాంకులో పనిచేశానని తన అనుభవాలను పంచుకున్నారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంటర్ విద్యలో పాఠ్య, నోటు పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం పునరుద్ధరణ, ప్రిన్సిపాల్స్‌కు పదోన్నతులు వంటి అనేక సంస్కరణలు చేపట్టామని, చేయాల్సింది ఇంకా ఉందని తెలిపారు. జూన్ నాటికి విద్యాశాఖలో సంస్కరణలు పూర్తి చేసి, అభ్యాసన ఫలితాలపై (లెర్నింగ్ అవుట్‌కమ్స్) దృష్టి సారిస్తామని చెప్పారు.
విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, వారిని చూసి అనేకమంది స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు. "మీరంతా ఇప్పుడు ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్లు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. 40 ఏళ్లలో ఎవరూ గెలవని మంగళగిరిలో నేను అనేక సవాళ్లను ఎదుర్కొని గెలిచాను. కష్టమైనా విద్యాశాఖను ఏరికోరి తీసుకున్నాను" అని అన్నారు.
ఇంటర్ తర్వాత ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలని, కేవలం ఐటీ మాత్రమే కాకుండా సోలార్ ఎనర్జీ, బయో గ్యాస్ వంటి కొత్త రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. చిన్న చిన్న అపజయాలకు కుంగిపోకుండా లక్ష్య సాధనకు కృషి చేయాలని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలని, విలువలను ఎన్నడూ మర్చిపోవద్దని హితవు పలికారు.


