Geraldine 'Jerri' Leo: ప్లాంక్ టెస్టులో అదరగొడుతున్న 100 ఏళ్ల బామ్మ గారు!

వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తున్నారు న్యూయార్క్‌కు చెందిన వందేళ్ల బామ్మ గారు. తన 100వ పుట్టినరోజు సందర్భంగా, యువత కూడా చేయటానికి కష్టపడే ఐదు నిమిషాల 'ప్లాంక్' వ్యాయామాన్ని అలవోకగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. జెరాల్డిన్ 'జెర్రి' లియో అనే ఈ బామ్మ, స్థానిక వ్యాయామశాలలో తన ఫిట్‌నెస్‌తో స్ఫూర్తికి ప్రతిరూపంగా నిలుస్తున్నారు.
బే షోర్‌లోని గ్రేట్ సౌత్ బే వైఎంసీఏలో జెర్రి లియో అందరికీ సుపరిచితురాలు. వందేళ్ల వయసులోనూ ఆమె ప్రదర్శించే శారీరక దారుఢ్యం, అత్యుత్తమ అథ్లెట్లను సైతం ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా తన శత వసంతాల పుట్టినరోజున, ఐదు నిమిషాల పాటు ప్లాంక్ పొజిషన్‌లో ఉండి తన సత్తా చాటారు. ప్లాంక్ అనేది పొట్ట కండరాలను బలోపేతం చేసే ఒక కఠినమైన వ్యాయామం. దీన్ని కేవలం కాలి వేళ్లు, ముంజేతులపై శరీర భారాన్ని మోపుతూ చేస్తారు. "ఇది మీ కోర్ (శరీర మధ్య భాగం) కండరాలకు అద్భుతంగా పనిచేస్తుంది" అని లియో తెలిపారు.
ఆమె ఫిట్ నెస్ ట్రైనర్ ఎలిజబెత్ గ్రాంట్ మాట్లాడుతూ, "జెర్రి ప్లాంక్ టెస్ట్ చేయడం నిజంగా నమ్మశక్యం కాని విషయం. ఆమెను కలిసిన ప్రతి ఒక్కరికీ ఆమె ఒక స్ఫూర్తి. ఆమె ప్లాంక్ చేసే భంగిమ చాలా బాగుంటుంది, ఇతరులకు కూడా సరైన పద్ధతిలో ఎలా చేయాలో ఆమె నేర్పించగలరు" అని ఏబీసీ7 వార్తా సంస్థకు వివరించారు. సాధారణంగా క్లాస్‌లోని వారు రెండు నిమిషాలకు మించి ప్లాంక్ చేయలేరని, కానీ లియో మాత్రం అదనంగా మరో మూడు నిమిషాలు, ఎలాంటి ఆయాసం లేకుండా పూర్తి చేస్తారని ఆమె పేర్కొన్నారు.
గ్రేట్ సౌత్ బే వైఎంసీఏ హెల్త్ అండ్ వెల్ నెస్ డైరెక్టర్ డెస్పినా టెనెడోరియో, లియోను ఒక శక్తివంతమైన మహిళగా అభివర్ణించారు. లియో స్నేహితురాలు మారియన్ సాటర్నో మాట్లాడుతూ, "ఆమె నా హీరో. క్లాస్‌లోని నాతో సహా కొందరు ఆమె ఫిట్ నెస్ చూస్తే కచ్చితంగా సిగ్గుపడతాం" అని సరదాగా వ్యాఖ్యానించారు.
తన జీవితంలో వైఎంసీఏ కీలక పాత్ర పోషించిందని లియో పేర్కొన్నారు. 1991లో వైఎంసీఏ ప్రారంభమైనప్పుడు, తన దివంగత భర్త డొమినిక్ ప్రోత్సాహంతో తాను ఇందులో చేరానని గుర్తు చేసుకున్నారు. "వైఎంసీఏ నా జీవితంలోని అన్ని కోణాల్లో నన్ను సజీవంగా, చురుకుగా ఉంచుతుంది" అని ఆమె తెలిపారు. లియో శుక్రవారం జరిగే వెయిట్‌లిఫ్టింగ్ క్లాస్‌కు కూడా హాజరవుతారు. ఆమె 100వ పుట్టినరోజు మైలురాయిని వైఎంసీఏతో పాటు స్థానిక బాబిలోనియన్ మేయర్ కూడా వేడుకగా జరుపుకుంటున్నారు.
తన ఆరోగ్య రహస్యాన్ని కూడా లియో పంచుకున్నారు. "ఏ పని చేసినా స్థిరంగా ఉండండి, సానుకూలంగా ఆలోచించండి, ఎప్పుడూ కదులుతూ ఉండండి. ఇది చాలా ముఖ్యం" అని ఆమె సూచించారు. వందేళ్ల వయసులోనూ ఆమె చూపుతున్న ఉత్సాహం, ఫిట్‌నెస్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.