Ganta Srinivasa Rao: విశాఖ నుంచి అమరావతికి హైదరాబాద్ మీదుగా రావాలా?: గంటా శ్రీనివాసరావు

Visakhapatnam to Amaravati via Hyderabad Ganta Srinivasa Raos Frustration

  • విశాఖ-విజయవాడ మధ్య నడిచే మార్నింగ్ ఫ్లయిట్స్ రద్దు
  • దాంతో తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్న గంటా
  • ఇవాళ అమరావతి చేరుకోవడానికి రెండు విమానాలు మారాల్సి వచ్చిందని ఆవేదన

విశాఖ-విజయవాడ నగరాల మధ్య ఉదయం నడిచే రెండు విమాన సర్వీసులు రద్దు చేయడం వల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతోందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తనకు, ఇతర ప్రయాణికులకు ఎదురైన అనుభవాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆంధ్రాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే తెలంగాణ మీదుగా వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. 

"ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి వెళ్లాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా ప్రయాణించాల్సి రావడం బాధాకరం. ఇవాళ ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి విజయవాడ విమానం ఎక్కి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది. 

ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరుకున్నారు. విశాఖ-విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి" అంటూ గంటా శ్రీనివాసరావు వివరించారు. 

ఈ మేరకు తన విమాన ప్రయాణ టికెట్లను కూడా పంచుకున్నారు.

Ganta Srinivasa Rao
Visakhapatnam
Amaravati
Hyderabad
Flight cancellations
Andhra Pradesh
Telangana
Air travel
Vijayawada
Travel woes
  • Loading...

More Telugu News