Jeevan Reddy: పార్టీ మార్పు ప్రచారం... కీలక వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి

- పార్టీ మార్పు ఊహాగానాలే అన్న జీవన్ రెడ్డి
- జిల్లాలో దశాబ్దకాలం ఒంటరిగా పోరాటం చేసినట్లు చెప్పిన జీవన్ రెడ్డి
- కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అనే విధంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేశానని ఉద్ఘాటన
పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పందించారు. పార్టీ మారబోతున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని ఆయన కొట్టిపారేశారు. అవన్నీ ఊహాగానాలేనని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాను దశాబ్దకాలం ఒంటరిగా పోరాటం చేశానని గుర్తు చేశారు. కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అనే విధంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేశానని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వి.హనుమంతరావు తర్వాత తానే సీనియర్ నాయకుడినని తెలిపారు. జానారెడ్డి కూడా తన కంటే నాలుగేళ్ల తర్వాత పార్టీలోకి వచ్చారని వెల్లడించారు. అయితే పార్టీలో సీనియారిటీకి స్థానం ఏమిటనే బాధ తనలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు సీనియర్లు వారి అభిప్రాయాలను మాట్లాడి ఉండవచ్చని అన్నారు.