Donald Trump: ఏప్రిల్ 20న మార్షల్ లా వంటి ఆర్డర్‌ను జారీ చేయనున్న డొనాల్డ్ ట్రంప్

Donald Trump to Issue Martial Law like Order on April 20th

  • జనవరి 20న ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేసిన ట్రంప్
  • అమెరికా దక్షిణ సరిహద్దుపై నియంత్రణ కోసం మిలటరీని మోహరించాలని నిర్ణయం
  • అందులో భాగంగా 1807 నాటి తిరుగుబాటు చట్టాన్ని అమలు చేయాలని భావిస్తున్న ట్రంప్
  • రక్షణశాఖ మంత్రి, హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి ఇచ్చే నివేదిక ఆధారంగా ఆదేశాలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన జనవరి 20న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు పెను సంచలనం సృష్టించాయి. ఇప్పుడు ఆయన మళ్లీ సంచలన ఆదేశాలు జారీచేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20న ఆయన ‘1807 నాటి తిరుగుబాటు చట్టాన్ని’ అమలు చేసే ఆదేశాలు ఇవ్వబోతున్నట్టు సమాచారం. జనవరి 20న ట్రంప్ జారీ చేసిన కార్య నిర్వాహక ఉత్తర్వులోని నిబంధన ప్రకారం.. ఈ ప్రకటన తేదీ నుంచి 90 రోజుల్లోపు అమెరికా దక్షిణ సరిహద్దు వద్ద ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తి కార్యాచరణ నియంత్రణను పొందేందుకు అక్కడ 1807 తిరుగుబాటు చట్టాన్ని అమలు చేయాలా? వద్దా? అనే దానిపై రక్షణశాఖ మంత్రి, హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి అధ్యక్షుడికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 

ఏంటీ 1807 తిరుగుబాటు చట్టం?
1807 తిరుగుబాటు చట్టం ప్రకారం.. ఏవైనా ప్రత్యేక పరిస్థితుల్లో మిలటరీని, యూఎస్ నేషనల్ గార్డ్‌ను మోహరించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. పౌరులు ఏదైనా తిరుగుబాటు చేసినా, హింసకు పాల్పడినా, లేదంటే ఏదైనా ప్రతిఘటన చర్యను పూర్తిగా అణచివేసేందుకు సైన్యానికి ఈ చట్టం అధికారం ఇస్తుంది. అన్ని సమయాల్లోనూ అమలులో ఉండే పోస్సే కామిటాటస్ చట్టాన్ని, అధికారాలను అధిగమించే అధికారాన్ని తిరుగుబాటు చట్టం కల్పిస్తుంది. సాయుధ దళాల కమాండర్, చీఫ్‌‌కు అమెరికాలో దళాలను ఎప్పుడు, ఎక్కడ మోహరించాలో నిర్ణయించే పూర్తి అధికారాలను అధ్యక్షుడికి ఇస్తుంది. 

జనవరి 20న ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన రెండ్రోజుల తర్వాత అంటే జనవరి 22న సరిహద్దు భద్రతను అమలు చేసేందుకు 1500 మంది యాక్టివ్ డ్యూటీ సర్వీస్ సభ్యులను, అదనంగా వైమానిక దళాన్ని పంపుతున్నట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. జనవరి 29న రక్షణ శాఖను ఆదేశిస్తూ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తానని ట్రంప్ ప్రకటించిన తర్వాత క్యూబాలోని గ్వాంటనామో బేలో 30 వేల మంది వరకు ఉన్న నేరస్థులను ఉంచాలని తన విభాగం భావిస్తున్నట్టు రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత మాత్రం దీనిపై ఎలాంటి కదలిక లేదు. 

ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై రక్షణ మంత్రి, హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి ఇంకా తమ తుది నివేదికను అధ్యక్షుడికి సమర్పించలేదు. ఇప్పటి వరకు ఈ మిషన్ సాధించిన విజయాన్ని ఆయనకు వివరించలేదు. ఈ నేపథ్యంలో దక్షిణ సరిహద్దుపై పూర్తి నియంత్రణ పొందేందుకు 1807 నాటి చట్టాన్ని త్వరలో అమలు చేస్తారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 

Donald Trump
Martial Law
Insurrection Act of 1807
US Southern Border
Executive Order
National Guard
Pete Hegseth
Homeland Security
Military Deployment
US Politics
  • Loading...

More Telugu News