Chandrababu Naidu: వైసీపీ ఒక ఫేక్ పార్టీ: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Slams YSRCP Calls it a Fake Party

  • పొన్నెకల్లు గ్రామంలో టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం
  • పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
  • ప్రజామోదం ఉన్నవారికే పదవులు అని చంద్రబాబు స్పష్టీకరణ

తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడికైనా పదవులు, బాధ్యతలు దక్కాలంటే క్షేత్రస్థాయిలో ప్రజలు, కార్యకర్తల ఆమోదం తప్పనిసరి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల మన్ననలు పొందని నేతలకు పార్టీలో స్థానం ఉండదని తేల్చిచెప్పారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని పొన్నెకల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు.

రానున్న కాలంలో పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిరంతరం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారికే సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. 

క్షేత్రస్థాయిలో పనిచేయకుండా, కార్యకర్తలకు దూరంగా ఉండే నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రతి ఎమ్మెల్యే, నాయకుడు తమ సొంత బూత్‌లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత తీసుకోవాలని, అప్పుడే క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు అవగతమవుతాయని సూచించారు. కుప్పంలో తాను కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తానని ఉదహరించారు.

సొంత మీడియా ఉందని...!

ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "వైసీపీ ఓ ఫేక్ పార్టీ" అని వ్యాఖ్యానించిన ఆయన, వివేకానందరెడ్డి హత్య కేసును తమ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే, ఆ ఘటనపైనా ప్రభుత్వంపై బురద జల్లారని అన్నారు. సొంత మీడియా ఉందని తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

బూతు రాజకీయాలకు స్వస్తి పలికేందుకే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, తప్పు చేసిన వారిని శిక్షించి తీరుతామని స్పష్టం చేశారు. లిక్కర్, ఇసుక వంటి విధానాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తామని, ఎలాంటి మొహమాటాలకు తావుండదని తెలిపారు.

గుజరాత్ స్ఫూర్తిగా!

రాష్ట్ర అభివృద్ధికి సుస్థిర ప్రభుత్వం అత్యవసరమని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. గుజరాత్‌లో బీజేపీ ఐదుసార్లు వరుసగా విజయం సాధించిందని, అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లోనూ టీడీపీ సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగాలని ఆకాంక్షించారు. 2019 ఎన్నికల్లో గెలిచి ఉంటే అమరావతి రాజధాని పూర్తయ్యేదని, గత ప్రభుత్వ పాలనలో నిలకడ లోపించడం వల్లే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని అభిప్రాయపడ్డారు. తాను తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే తీసుకుంటానని తెలిపారు.

కార్యకర్తలు స్కిల్ పెంచుకోవాలి

2019-24 మధ్య కాలంలో ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని, ప్రాణాలకు తెగించి పార్టీ కోసం నిలబడిన కార్యకర్తల త్యాగాలను చంద్రబాబు కొనియాడారు. వారి కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు బూత్, యూనిట్, క్లస్టర్ల వారీగా పర్యవేక్షణ ఉంటుందని, నాయకులు, కార్యకర్తలు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. 

పార్టీ కార్యక్రమాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, బీసీలే టీడీపీకి వెన్నుముక అని పునరుద్ఘాటించారు. ప్రమాదవశాత్తు మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందిస్తున్న ఏకైక పార్టీ టీడీపీయేనని గుర్తుచేశారు.

ప్రతి ఒక్కరికీ పథకాలు

సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వివక్ష ఉండదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. వచ్చే నెల నుంచే 'తల్లికి వందనం', 'అన్నదాత సుఖీభవ', 'మత్స్యకార భరోసా' వంటి పథకాలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Chandrababu Naidu
TDP
YCP
Andhra Pradesh Politics
Amaravati
Telugu Desam Party
YSR Congress Party
Indian Politics
Gudiyatham
State Development
  • Loading...

More Telugu News