Chamala Kiran Kumar Reddy: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై మోదీ వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ ఎంపీ

- హర్యానా ప్రజలను మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారన్న కాంగ్రెస్ ఎంపీ
- తెలిసీ తెలియని సమాచారంతో మాట్లాడటం సరికాదన్న కిరణ్ కుమార్ రెడ్డి
- బీసీ కులగణనపై ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని నిలదీత
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ 400 ఎకరాల భూముల విషయంలో అందరూ అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫేక్ వీడియోలను సృష్టించి అసత్య ప్రచారం చేశారని తెలిపారు. ఏఐ వీడియోలు సృష్టించిన వారిపై హైకోర్టులో కేసు వేయడంతో వాటిని తొలగించారని పేర్కొన్నారు.
ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ హర్యానా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలిసీ తెలియని సమాచారంతో ఆయన మాట్లాడటం సరికాదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రధాని తన కార్యాలయం ద్వారా తెలుసుకున్న తర్వాత మాట్లాడాలని సూచించారు. సన్న బియ్యం, భూభారతి వంటి మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. తాను బీసీ అని చెప్పుకునే మోదీ బీసీ కులగణనపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.