Venkata Rao: మూడ్నెల్లుగా ఆచూకీలేని ఏపీ వ్యక్తి పాక్ సరిహద్దుల్లో ప్రత్యక్షం... ఇంటికి చేర్చిన బీఎస్ఎఫ్

- మూడు నెలల క్రితం ఇంటి నుంచి తప్పిపోయిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకటరావు
- జమ్మూకశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ప్రత్యక్షం
- వెంకటరావును సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించిన సరిహద్దు భద్రతాదళం అధికారులు
మూడు నెలల క్రితం తప్పిపోయిన ఓ వ్యక్తిని బీఎస్‌ఎఫ్ జవాన్లు సురక్షితంగా ఇంటికి చేర్చడంతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సరిహద్దు భద్రతా దళానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లో పాకిస్థాన్ సరిహద్దులో సంచరిస్తూ కనిపించిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని బీఎస్‌ఎఫ్ అధికారులు రక్షించారు. అనంతరం అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేసినట్లు సరిహద్దు భద్రతాదళం ఒక ప్రకటనలో తెలిపింది.
బీఎస్‌ఎఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వెంకటరావు (50) మూడు నెలలుగా కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు ఆయన కోసం వెతికినా ఫలితం లేకపోయింది. అయితే, ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద సంచరిస్తున్న వ్యక్తిని విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్ అధికారులు గుర్తించి విచారించగా, ఆయన పూర్తి వివరాలు చెప్పలేకపోయారు.
దీంతో ఆయన కుటుంబ సభ్యుల సమాచారం తెలుసుకునేందుకు బీఎస్‌ఎఫ్ అధికారులు మరింత శ్రద్ధ చూపారు. చివరికి అతని కుటుంబ సభ్యుల వివరాలు తెలియడంతో వారికి సమాచారం అందించి అప్పగించారు. ఈ సందర్భంగా వెంకటరావు కుటుంబ సభ్యులు బీఎస్‌ఎఫ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. సరిహద్దు భద్రతతో పాటు సామాజిక బాధ్యత విషయంలో తమ అధికారులు మరోసారి నిబద్ధతను చాటుకున్నారని సరిహద్దు భద్రతాదళం పేర్కొంది.