ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా గంగూలీ

  • మరో మూడేళ్లపాటు కొనసాగనున్న గంగూలీ
  • కమిటీలో సభ్యుడిగా వీవీఎస్ లక్ష్మణ్ సహా దిగ్గజాలు
  • మహిళా క్రికెట్ కమిటీ చైర్ పర్సన్‌గా కేథరిన్ క్యాంప్‌బెల్
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని పురుషుల క్రికెట్ కమిటీ చైర్ పర్సన్‌గా మరోమారు నియమిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అలాగే, గంగూలీ సహచరుడు వీవీఎస్ లక్ష్మణ్‌ను కూడా మరోమారు ప్యానల్ సభ్యుడిగా నియమించింది. ఈ మేరకు ఐసీసీ వెల్లడించింది. టీమిండియాను 2000వ సంవత్సరం నుంచి 2005 వరకు నడిపించిన గంగూలీ తొలిసారి 2021లో కమిటీ చైర్ పర్సన్‌గా నియామకమయ్యాడు. అప్పటి వరకు ఆ స్థానంలో సేవలు అందించిన దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్థానంలో బాధ్యతలు చేపట్టాడు. 52 ఏళ్ల గంగూలీ మరో మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతాడు. 

గంగూలీతోపాటు లక్ష్మణ్, ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఆటగాడు హమీద్ హసన్, వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం డెస్మాండ్ హేన్స్, సౌతాఫ్రికా టెస్ట్, వన్డే కెప్టెన్ తెంబా బవుమా, ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ జొనాథన్ ట్రాట్‌లు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు.

ఇక ఐసీసీ మహిళా క్రికెట్ కమిటీలో న్యూజిలాండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ కేథరిన్ క్యాంప్‌బెల్ చైర్ పర్సన్‌గా, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ అవ్రిల్ ఫాహే, క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ)కు చెందిన ఫొలెట్సి మోసేకి ఇతర సభ్యులుగా నియమితులయ్యారు.


More Telugu News