RCB: 174 పరుగుల లక్ష్యాన్ని ఊదిపడేసిన ఆర్సీబీ... మొదటి ముగ్గురే కొట్టేశారు!

- జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
- 9 వికెట్ల తేడాతో నెగ్గిన ఆర్సీబీ
- రాణించిన సాల్ట్, కోహ్లీ, పడిక్కల్
ఈసారి ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జోరు మామూలుగా లేదు. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో జైపూర్ లో జరిగిన పోరులో ఆర్సీబీ జట్టు అన్ని రంగాల్లో రాణించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేయగా... 174 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 1 వికెట్ నష్టానికి 17.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్.... ఈ ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్ మెనే కొట్టేశారు.
సాల్ట్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 65 పరుగులు చేసి అవుటయ్యాడు.. కోహ్లీ 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 62, పడిక్కల్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ కు 1 వికెట్ దక్కింది.
టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్
ఇవాళ డబుల్ హెడర్ లో భాగంగా రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమన్నది లేకుండా ఆడుతున్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కటే. ఆ జట్టు ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడి, అన్నింట్లో గెలిచింది. మరోవైపు ముంబయి ఇండియన్స్ వరుస ఓటములతో విలవిల్లాడుతోంది. ఆ జట్టు 5 మ్యాచ్ లు ఆడి నాలుగింట్లో ఓడిపోయింది.