Vinesh Phogat: మూసుకుని ఓ మూలన కూర్చోండి... ట్రోలర్స్ కు ఘాటుగా బదులిచ్చిన వినేశ్ ఫోగాట్

- పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో వినేశ్ డిస్ క్వాలిఫై
- అయినప్పటికీ రూ.4 కోట్ల నజరానా ఇచ్చిన హర్యానా సర్కారు
- వినేశ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్
పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయినప్పటికీ, హర్యానా ప్రభుత్వం నుంచి రూ. 4 కోట్ల నగదు పురస్కారం అందుకున్న రెజ్లర్ వినేష్ ఫోగాట్ తనపై వస్తున్న విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. తనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నవారిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. నిబంధనల కారణంగా ఒలింపిక్స్‌కు దూరమైనప్పటికీ, ప్రభుత్వం ఆమెకు వెండి పతక విజేతకు సమానమైన ప్రోత్సాహకాన్ని అందించింది. దీనిపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరుగుతండగా, విమర్శకులకు వినేశ్ కౌంటర్ ఇచ్చారు.
అధిక బరువు కారణంగా పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయిన వినేశ్ ఫోగాట్, ఆ నిర్ణయాన్ని మార్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే, హర్యానా ప్రభుత్వం ఆమెకు మూడు ఆప్షన్లు ఇచ్చింది. అందులో 4 కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని ఆమె ఎంచుకున్నారు. దీనిపై కొందరు విమర్శలు చేయగా, వాటికి ఆమె తనదైన శైలిలో బదులిచ్చారు.
"ఇక మూసుకొని ఓ మూలన కూర్చోండి. మీకు బాగా వచ్చేది ఏదో అది చేసుకోండి. ఏడవండి... ఏడుస్తూనే ఉండండి! ఎందుకంటే మేమెక్కడికీ వెళ్లడం లేదు. మేమిక్కడే ఉంటాం. స్థిరంగా, చెక్కుచెదరకుండా, మా సొంత వెన్నెముకతో, ఆత్మగౌరవంతో నిలబడతాం!" అని ఆమె అన్నారు. "ఇది డబ్బు గురించి కాదు, గౌరవం గురించి. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, నగదు పురస్కారం వచ్చిందా అని?" అని వినేశ్ అన్నారు.
నేనేమీ అడుక్కోవడం లేదు... ఇది నా హక్కు!
"కొందరు రెండు రూపాయల కోసం ట్వీట్లు చేస్తూ, ఉచిత సలహాలు ఇస్తుంటారు. వాళ్లకో విషయం చెప్పదలచుకున్నా. నేను ఇప్పటి వరకు కోట్లాది రూపాయల విలువైన ఆఫర్లను తిరస్కరించాను. శీతల పానీయాల ప్రకటనల నుంచి ఆన్‌లైన్ గేమ్‌ల వరకు చాలా వాటిని వద్దనుకున్నా" అని వినేశ్ అన్నారు.
"నేను నా సిద్ధాంతాలను ఎప్పుడూ వదులుకోలేదు. ఏదైనా సాధించానంటే అది నా కష్టంతోనే, నిజాయతీతోనే. నా వాళ్ల ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. ఇక అడుక్కోవడం గురించి మాట్లాడితే... ఆత్మగౌరవం అంటే ఏంటో మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. హక్కులను లాక్కోకూడదు, వాటిని గెలుచుకోవాలని నా పెద్దలు చెప్పారు. అవసరమైనప్పుడు మనవాళ్లను ఎలా పిలవాలో నాకు తెలుసు. కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లతో ఎలా నిలబడాలో కూడా తెలుసు" అని ఆమె తన విమర్శకులకు ఘాటుగా సమాధానమిచ్చారు.
వినేష్ ఫోగాట్‌కు ప్రభుత్వ అండ
ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ మాట్లాడుతూ వినేష్ ఫోగాట్ హర్యానాకు గర్వకారణమని కొనియాడారు. ఆమె గౌరవం ఎప్పటికీ తగ్గదని హామీ ఇచ్చారు. విధానపరమైన నిర్ణయం కారణంగానే ఆమె ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయారని ఆయన అన్నారు.