B. Bharathi: కుమార్తెను నరబలి ఇచ్చిన తల్లికి మరణశిక్ష .... సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు

Mother Sentenced to Death for Child Sacrifice in Telangana
  • 2021లో దారుణ ఘటన
  • సర్పదోషం పోగొట్టుకునేందుకు కన్నబిడ్డనే బలి
  • గతంలో భర్తపై తూకం రాయితో దాడి
  • అరుదైన కేసుగా భావించి మరణశిక్ష విధించిన న్యాయస్థానం
సూర్యాపేట కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2021లో తన సొంత బిడ్డను నరబలి ఇచ్చిన బి. భారతి అనే మహిళకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. భారతి తనకున్న 'సర్ప దోషం' తొలగిపోవాలనే దురుద్దేశంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. భర్తపై తూకం రాయితో దాడి చేసిన కేసులో ఆమె గతంలోనే జైలు శిక్ష అనుభవించింది. ఈ నేరం కూడా ఆమెకు మరణ శిక్ష పడటానికి ఒక కారణంగా మారింది.

మోతే మండలం మేకలపాటి తండాలో 2021 ఏప్రిల్ 15న ఈ దారుణం జరిగింది. భారతి ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తూ, ఏడు నెలల పసికందు గొంతు కోసి, నాలుకను కూడా కోసింది. ఆ సమయంలో ఆమె భర్త కృష్ణ, అనారోగ్యంతో మంచానపడిన మామ మాత్రమే ఇంట్లో ఉన్నారు. బిడ్డ ఏడుపు విని మామ లేచి చూడగా, రక్తపు మరకలతో భారతి బయటకు వస్తూ కనిపించింది. దేవుళ్ళకు బలి ఇచ్చి సర్పదోషం పోగొట్టుకున్నానని భారతి చెప్పింది.

వెంటనే ఈ విషయాన్ని ఆయన తన కుమారుడు కృష్ణకు చెప్పారు. దాంతో కృష్ణ బంధువులకు, ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పడంతో వారు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మోతే పోలీసులు భారతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు 10 మంది సాక్షులను విచారించారు. 

భారతికి సర్పదోషం ఉందని, దాని నివారణ కోసమే ఈ దారుణానికి ఒడిగట్టిందని కృష్ణ తెలిపాడు. అంతేకాకుండా, 2023లో కృష్ణ నిద్రిస్తుండగా భారతి తూకం రాయితో తలపై దాడి చేసింది. ఈ దాడిలో కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో భారతికి ఏడాది జైలు శిక్ష పడింది. 

పాఠశాలలో భారతి, కృష్ణ క్లాస్‌మేట్స్. ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో మొదట ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. 2019లో కృష్ణ, భారతి వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు భారతి మానసిక సమస్యలతో బాధపడేదని, ఖమ్మంలో మానసిక వైద్యులను కూడా సంప్రదించామని కృష్ణ తెలిపాడు. 

ప్రస్తుతం భారతి చంచల్‌గూడ మహిళా జైలులో ఉంది. అన్ని సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత కోర్టు ఈ కేసును ‘అరుదైన కేసు’గా పరిగణించి భారతికి మరణ శిక్ష విధించింది.
B. Bharathi
Infanticide
Human Sacrifice
Suryapeta Court
Death Penalty
Telangana
Krishna
Child Murder
Snake Curse
India

More Telugu News