Kavya Maran: కావ్యా పాప నవ్వింది... సన్ రైజర్స్ అన్ బిలీవబుల్ విక్టరీ!

- ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక పరుగుల ఛేదన
- 246 పరుగుల టార్గెట్ ను 18.3 ఓవర్లలోనే ఛేదించిన సన్ రైజర్స్
- అభిషేక్ వర్మ సూపర్ సెంచరీ... హెడ్ విధ్వంసక ఇన్నింగ్స్
- వరుసగా నాలుగు ఓటముల తర్వాత హైదరాబాద్ టీమ్ కు తొలి గెలుపు
సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మైదానంలోకి దిగిన తర్వాత ఎలా ఆడుతోందో చెప్పడానికి ఆ జట్టు యజమాని కావ్యా మారన్ ముఖం చూస్తే చాలు! తమ ఆటగాళ్లు బాగా ఆడితే ఆమె ముఖంలో నవ్వులు విరబూస్తాయి... సరిగా ఆడకపోతే ముఖం చిన్నబోతుంది! ఇవాళ కావ్య పాప నవ్వింది. మరి సన్ రైజర్స్ జట్టు సాధించింది అలాంటి ఇలాంటి విజయం కాదు... నమ్మశక్యం కాని రీతిలో గెలిచి సన్ రైజర్స్ అంటే ఇదీ అని చూపించేలా ఘనంగా నెగ్గింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత హైదరాబాద్ టీమ్ కు ఇది తొలి గెలుపు కావడం విశేషం.
సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 246 పరుగుల విజయలక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్ శర్మ సెన్సేషనల్ బ్యాటింగ్ ప్రదర్శనతో సెంచరీ సాధించడం ఈ మ్యాచ్ లో హైలైట్. అభిషేక్ శర్మ 55 బంతుల్లో 141 పరుగులు చేసి పంజాబ్ కు విజయాన్ని దూరం చేశాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ స్కోరులో 14 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి. ఇన్నింగ్స్ ఆరంభంలో ఓసారి నోబాల్ కారణంగా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అభిషేక్ శర్మ పంజాబ్ బౌలర్ల బంతులను కసిదీరా బాదాడు.
సెంచరీ పూర్తయ్యాక అభిషేక్ శర్మ జేబులోంచి ఓ తెల్ల కాగితం వంటిది బయటికి తీసి అందరికీ ప్రదర్శించాడు. దాన్ని పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు కూడా అందుకుని పరిశీలించారు. దానిపై, "ఈ శతకం ఆరెంజ్ ఆర్మీ కోసం అని రాసి ఉంది. అంటే... తాను సెంచరీ కొట్టి తీరాలని అభిషేక్ శర్మ ముందే డిసైడ్ చేసుకుని ఆత్మవిశ్వాసంతో బరిలో దిగినట్టు అర్థమవుతోంది.
అభిషేక్ కు తోడు ట్రావిస్ హెడ్ కూడా విరుచుకుపడడంతో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పలుమార్లు బిక్కమొహం వేయడం కనిపించింది. హెడ్ 37 బంతుల్లో 66 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ ఆడుతున్నంత సేపు మైదానం హోరెత్తిపోయింది. ఈ జోడీ అవుటయ్యాక క్లాసెన్ (21 నాటౌట్), ఇషాన్ కిషన్ (9 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. చివర్లో క్లాసెన్ ఓ ఫోర్ కొట్టి మ్యాచ్ ను ముగించాడు.
ఐపీఎల్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక పరుగుల ఛేదన. పంజాబ్ బౌలర్లలో అర్షదీప సింగ్ 1, చహల్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో సన్ రైజర్స్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. సన్ రైజర్స్ ఇప్పటిదాకా 6 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు సాధించింది.
