NTR: ఇవాళ ఆ లోటు విజయశాంతి తీర్చారు: ఎన్టీఆర్

- హైదరాబాదులో అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ వేడుక
- ముఖ్య అతిథిగా ఎన్టీఆర్
- ఎన్టీఆర్ ప్రసంగానికి అభిమానుల నుంచి విశేష స్పందన
కళ్యాణ్ రామ్ చిత్రం 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలు పంచుకున్నారు. గతంలో 'దేవర' సినిమా కార్యక్రమం అభిమానుల తాకిడి కారణంగా రద్దు అయింది. ఆ తరువాత చాలా కాలానికి మళ్ళీ సోదరుడు కళ్యాణ్ రామ్ కోసం ఆయన ఒక వేడుకకు హాజరయ్యారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, అన్నయ్య కళ్యాణ్ రామ్ సినిమా వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాకుండా విజయశాంతి ప్రసంగం వింటుంటే తండ్రి లోటు తీరినట్టు అనిపించిందని ఆయన పేర్కొన్నారు.
ఆగస్టు 14న తాను నటించిన 'వార్ 2' చిత్రం విడుదల కానుందని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, మళ్ళీ ఎప్పుడు కనబడతానో తెలియదు కాబట్టి, ఈ వేడుకలో తన మనసులోని మాటలను పంచుకోవాలని ఉందని అన్నారు.
"అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా కథ 'కర్తవ్యం' సినిమా స్ఫూర్తితో రూపొందిందని భావిస్తున్నాను. కర్తవ్యం సినిమాలో వైజయంతి ఐపీఎస్ పాత్రలో నటించారు, ఆ పాత్రకు కొడుకు ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ సినిమా రూపొందింది. ఇలాంటి ఆలోచన రావడం చాలా సంతోషంగా ఉంది. నేను సినిమా చూశాను. విజయశాంతి గారు, పృథ్వీ గారు లేకపోతే ఈ సినిమా లేదు. నిర్మాతలు, దర్శకులు ఎంతో కష్టపడి ఈ సినిమాను రూపొందించారు" అని అన్నారు.
"ఏప్రిల్ 18న సినిమా విడుదల అవుతుంది. రాసి పెట్టుకోండి, చివరి 20 నిమిషాలు థియేటర్లో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. అంత అద్భుతంగా ఈ సినిమాను మలిచారు. కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరవేయడానికి సంకోచిస్తుంటే, నేనే ఎగరవేస్తాను" అంటూ ఎన్టీఆర్ సరదాగా అన్నారు.
సినిమా చూస్తున్నప్పుడు తన కన్నీళ్లు ఆగలేదని, ప్రేక్షకులు కూడా అదే అనుభూతి పొందుతారని ఎన్టీఆర్ అన్నారు. క్లైమాక్స్ సన్నివేశం అంత బాగా రావడానికి కళ్యాణ్ రామ్ కారణమని, ఆయన ఈ సినిమా ఆలోచనను నమ్మి, ఎంతో డెడికేషన్‌తో నటించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. కళ్యాణ్ రామ్ ఎన్నో గొప్ప సినిమాలు చేసినప్పటికీ, ఇది ఆయన కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని ఎన్టీఆర్ కొనియాడారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారని, విజయశాంతి తల్లి పాత్రలో నమ్మి నటించారని, అందుకే సినిమా ఇంత బాగా వచ్చిందని ఆయన అన్నారు.