Georgia: 'హిందూ ఫోబియా'పై బిల్లు తీసుకువచ్చిన తొలి అమెరికా రాష్ట్రం ఇదే!

- పలు అమెరికా రాష్ట్రాల్లో హిందువులపై వ్యతిరేకత
- ఇకపై జార్జియా రాష్ట్రంలో హిందువులపై వివక్ష ప్రదర్శించడం నేరం
- చట్టపరమైన చర్యలకు బిల్లు ద్వారా అవకాశం
అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హిందువులపై వ్యతిరేకతను (హిందూ ఫోబియా) నేరంగా పరిగణించే బిల్లును ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఈ చట్టం ద్వారా... హిందువులపై జరిగే వివక్షను నేరంగా పరిగణించి, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కలుగుతుంది.
రిపబ్లికన్ సెనేటర్లు షాన్ స్టిల్, క్లింట్ డిక్సన్, డెమోక్రటిక్ సెనేటర్లు జాసన్ ఎస్టెవ్స్, ఇమాన్యుల్ డి జోన్స్ సంయుక్తంగా ఎస్బీ-375 బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు 'హిందూఫోబియా'ను అంతం చేయడానికి ఉద్దేశించబడింది అని కోలిషన్ ఆఫ్ హిందూస్ ఇన్ నార్త్ అమెరికా ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ సందర్భంగా ఒక ప్రకటన చేస్తూ, జార్జియా రాష్ట్రం ఎస్బీ-375 బిల్లును ప్రవేశపెట్టిందని, ఇది హిందూఫోబియా మరియు హిందూ వ్యతిరేక వివక్షను గుర్తించడానికి రాష్ట్ర శిక్షాస్మృతిని సవరిస్తుందని తెలిపింది. దీని ద్వారా, హిందూ వ్యతిరేకతను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని వివరించింది. ఈ బిల్లును జార్జియాలోని హిందువుల రాజకీయ కార్యవర్గం కూడా సమర్థించింది.
ఈ బిల్లు ద్వారా... రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సాధారణ నిబంధనలు, జాతి, రంగు, మతం లేదా జాతీయ మూలం ఆధారంగా వివక్షను నిషేధించే చట్టాలు మరియు నిబంధనలకు హిందూఫోబియా నిర్వచనాన్ని వర్తింపజేయడానికి కొన్ని ప్రభుత్వ సంస్థలకు అధికారం లభిస్తుంది.