Mamata Banerjee: వక్ఫ్ చట్టాన్ని పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయబోం: మమతా బెనర్జీ

- మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం
- రాజకీయాల కోసం అల్లర్లకు పాల్పడవద్దన్న మమతా బెనర్జీ
- చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్న మమతా బెనర్జీ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టాన్ని పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. వక్ఫ్ చట్టం మంగళవారం నుంచి అమలులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ ప్రాంతాలలో నిరసనకారులు ఆందోళనలు నిర్వహించి రోడ్లను దిగ్బంధించారు. వారిని నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందిస్తూ, ప్రతి జీవితం ఎంతో విలువైనదని, రాజకీయాల కోసం అల్లర్లకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. అల్లర్లకు పాల్పడేవారు సమాజానికి ప్రమాదకారులని, వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి ప్రవర్తనను ఉపేక్షించేది లేదని ఆమె తేల్చి చెప్పారు. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం మతాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తున్నాయని, అలాంటి చర్యలకు లొంగవద్దని సూచించారు.
మతం అంటే మానవత్వం, నాగరికత, సామరస్యం అని ఆమె అన్నారు. శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరిని కోరారు. ఈ చట్టాన్ని తాము చేయలేదని, వ్యతిరేకిస్తున్నవారు కేంద్ర ప్రభుత్వం వద్ద సమాధానం కోరాలని ఆమె సూచించారు. వక్ఫ్ చట్టాన్ని బెంగాల్‌లో అమలు చేయబోమని స్పష్టం చేశారు.