Rekha Gupta: ప్లీజ్.. అలా చేయకండి.. వాహనదారుడికి చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేసిన ఢిల్లీ సీఎం

- 'ఎక్స్' వేదికగా ఆసక్తికర వీడియో షేర్ చేసిన సీఎం రేఖా గుప్తా
- ఓ వ్యక్తి తన కారులోంచి రోడ్డు పక్కన ఉన్న ఆవు పైకి రోటీ విసిరిన వైనం
- అదే సమయంలో అక్కడి నుంచే వెళుతున్న ముఖ్యమంత్రి
- వెంటనే తన వాహన శ్రేణిని ఆపి.. వాహనదారుడి వద్దకు వెళ్లిన సీఎం
- మరోసారి అలా చేయొద్దంటూ విజ్ఞప్తి చేసిన వైనం
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఓ ఆసక్తికరమైన వీడియోను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో ఆమె ఓ వాహనదారుడిని చేతులు జోడించి మరీ అభ్యర్థించడం ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే... ఓ వ్యక్తి తన కారులో వెళుతూ... రోడ్డు పక్కన ఉన్న ఓ ఆవుకు రొట్టేను విసిరేశాడు. అదే సమయంలో అక్కడి నుంచే వెళుతున్న ముఖ్యమంత్రి అది గమనించారు. వెంటనే తన వాహన శ్రేణిని ఆపి, నేరుగా ఆ వాహనదారుడి వద్దకు వెళ్లారు.
నేను... ఢిల్లీ సీఎం రేఖ గుప్తా అని తనను తాను ఆ వ్యక్తితో పరిచయం చేసుకున్నారు. "రోడ్డు పక్కన ఉన్న ఆ ఆవుకు మీరు రోటీ విసిరేయడం చూశాను. అలా చేయడం మంచిది కాదు. అది మన సంస్కృతి కూడా కాదు. మనం ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం. దాన్ని అలా రోడ్డుపై విసిరేయడం కరెక్ట్ కాదు. దానికోసం ఆ ఆవు రోడ్డుపైకి వస్తుంది. దాంతో రోడ్డు ప్రమాదం జరగొచ్చు. అది ఆవుతో పాటు మనషులకు కూడా ప్రమాదమే. మరోసారి అలా చేయొద్దు" అని సీఎం చేతులు జోడించి అభ్యర్థించారు.
"ఆహారాన్ని అగౌరవపరచకూడదు. మీరు జంతువులకు ఆహారం ఇవ్వాలనుకుంటే, దయచేసి గోశాల లేదా వాటికి కేటాయించిన ప్రత్యేక ప్రదేశంలో చేయండి. ఇది మన బాధ్యత, విలువలకు సంకేతం" అని రేఖ గుప్తా ఢిల్లీ వాసులకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
ఇక ఇటీవల హైదర్‌పూర్ ఫ్లైఓవర్‌పై పశువుల గుంపు రోడ్డుపైకి రావడంతో సీఎం కాన్వాయ్ దాదాపు 15 నిమిషాల పాటు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇది జరిగిన వారాల వ్యవధిలోనే ఈరోజు మరోసారి ఆమె రోడ్లపైకి వచ్చే పశువుల విషయమై ఈ విజ్ఞప్తి చేశారు.