B R Naidu: అదంతా తప్పుడు ప్రచారం: బీఆర్ నాయుడు

- టీటీడీ గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయంటూ భూమన ఆరోపణలు
- ఖండించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
- తాము చేపడుతున్న కార్యక్రమాలు చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శలు
టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ గోశాలలో ఆవులు పెద్ద సంఖ్యలో మృతి చెందాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. భూమన చెబుతున్న దాంట్లో నిజం లేదని స్పష్టం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు, కల్పిత ఆరోపణలు చేయడం అత్యంత విషాదకరం అని పేర్కొన్నారు.
టీటీడీ ట్రస్ట్ ఎంతో అంకితభావంతో పుణ్య కార్యక్రమాలు చేపడుతుంటే, కంటగింపుతో ఈ తరహా చర్యలకు దిగడం బాధాకరమని బీఆర్ నాయుడు తెలిపారు. గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదని, వేద కాలం నుంచే గోమాతను దేవతలతో సమానంగా పూజిస్తూ వస్తున్నామని వివరించారు.
ఒక్క గోవు చనిపోయినా దాని మృతిని సాధారణ ఘటనగా భావించలేమని... కానీ అనారోగ్యాలు, వృద్ధాప్యం, ప్రమాదాల వంటి కారణాలతో గోవులు మృతి చెందితే వాటిని రాజకీయంగా అబద్ధపు ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మం అని విమర్శించారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫొటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా చిత్రీకరించడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలను మోసగించేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడడం బాధాకరమని, ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించాలని, మోసపోవద్దని సూచించారు. గోసేవ అంటేనే గోదేవి సేవ... ఇంతటి పవిత్రమైన సేవపై రాజకీయ లబ్ధి కోసం బురద చల్లే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలని బీఆర్ నాయుడు పిలుపునిచ్చారు