Hanuman Jayanti: గౌలిగూడ నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర

- గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు కొనసాగనున్న శోభాయాత్ర
- కోఠి, నారాయణగూడ, చిక్కడపల్లి, సికింద్రాబాద్ మీదుగా సాగనున్న శోభాయాత్ర
- 12 కిలోమీటర్ల మేర భారీగా పోలీసు బందోబస్తు
హైదరాబాద్‌లోని గౌలిగూడ శ్రీరామ మందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజున గౌలిగూడ శ్రీరామ మందిరం నుంచి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు.
ఈ శోభాయాత్ర గౌలిగూడ నుంచి ప్రారంభమై కోఠి, నారాయణగూడ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, సికింద్రాబాద్ మీదుగా తాడ్‌బండ్ ఆలయానికి చేరుకుంటుంది. 12 కిలోమీటర్ల మేర జరిగే ఈ యాత్రకు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు.
మరోవైపు, కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి వీర హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. సైదాబాద్, మాదన్నపేట మీదుగా ఈ పాదయాత్ర సాగుతుంది.
కర్మన్ ఘాట్ ఆంజనేయుడిని దర్శించుకున్న కవిత
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కర్మన్ ఘాట్ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కవిత మాట్లాడుతూ, హనుమంతుడు అంటేనే ప్రేమ అని, భయం లేకుండా చేసేవాడని అన్నారు. ఆ దేవదేవుడి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.