Indian Railways: తత్కాల్ బుకింగ్ వేళలు మార్పు అంటూ వార్తలు... కేంద్రం ఏం చెప్పిందంటే...!

- రైల్వే తత్కాల్ బుకింగ్ టైమింగ్స్‌లో మార్పులు అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
- ఇలాంటి వార్తలు నమ్మొద్దన్న కేంద్రం
- ఎలాంటి మార్పునూ ప్రతిపాదించలేదని క్లారిటీ ఇచ్చిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్
భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయాల్లో మార్పులు జరిగాయని, నూతన నిబంధనలు ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వస్తాయని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ వార్తలు నిరాధారమైనవని స్పష్టం చేసింది. ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని పీఐబీ ఫాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
ఏప్రిల్ 15 నుంచి తత్కాల్ బుకింగ్ సమయాలు మారుతున్నట్లు ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, అది పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఏసీ, నాన్ ఏసీ తరగతులకు తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ బుకింగ్ విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న సమయాల్లో ఎటువంటి మార్పులు లేవని తెలిపింది. ఏజెంట్లకు అనుమతించిన బుకింగ్ సమయాల్లో కూడా మార్పులు లేవని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.