Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకి జాతీయ స్థాయిలో పదవి...!

- తమిళనాడు బీజేపీ నూతన చీఫ్ గా నాగేంద్రన్ !
- అన్నామలైకి జాతీయ స్థాయిలో కీలక పదవి లభించనుందని టాక్
- అమిత్ షా పరోక్ష వ్యాఖ్యలతో క్లారిటీ
తమిళనాడు బీజేపీ రాజకీయాల్లో శుక్రవారం రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు, మరొకటి అన్నా డీఎంకేతో పొత్తు. బీజేపీ అగ్రనాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం అన్నా డీఎంకేతో పొత్తుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.
పళనిస్వామి నేతృత్వంలో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. మరో పక్క తమిళనాడు బీజేపీ చీఫ్‌గా ఉన్న అన్నామలై స్థానంలో కొత్త అధ్యక్షుడుగా, తిరునల్వేలి ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ ఎన్నిక కానున్నారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక లాంఛనప్రాయం అయింది.
అయితే తమిళనాడులో బీజేపీకి ఓట్ల శాతం పెరగడానికి అన్నామలై కారణమనే మాట వినిపిస్తోంది. 2021 జూన్‌లో తమిళనాడు బీజేపీ పగ్గాలు చేపట్టిన అన్నామలై డీఎంకేను ధీటుగా ఎదుర్కొన్న నేతగా పేరు సంపాదించారు. ఎన్ మన్ ఎన్ మక్కల్ పాదయాత్ర ద్వారా బీజేపీని తమిళనాడులో ప్రతి గ్రామానికీ తీసుకువెళ్లారు. దీని ఫలితంగా బీజేపీకి ఓటు శాతం పెరిగింది. 2024 ఎన్నికల్లో ఒక్క స్థానం రాకపోయినప్పటికీ ప్రజల ఆదరణ అయితే కనిపించింది. దీంతో రాబోయే ఎన్నికలకు బీజేపీతో పొత్తుకు అన్నా డీఎంకే ముందుకు వచ్చిందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం పళనిస్వామి ఢిల్లీలో అమిత్ షాతో సమావేశం అయినప్పుడే పొత్తు దాదాపు ఖాయమైనట్లుగా వార్తలు వచ్చాయి.
తాజాగా శుక్రవారం చెన్నైలో అమిత్ షా పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన అన్నామలైని అమిత్ షా ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను ప్రజలకు చేరవేయడంలో, పార్టీ కార్యక్రమాలను గ్రామ గ్రామానికీ తీసుకువెళ్లడంలో అన్నామలై కృషి అపూర్వమైనదని కొనియాడారు. అన్నామలై సంస్థాగత నైపుణ్యాలను పార్టీ జాతీయ స్థాయిలో వినియోగించుకుంటుందని పేర్కొన్నారు. దీంతో అన్నామలైకి జాతీయ స్థాయిలో పదవి లభించనుందని భావిస్తున్నారు. అమిత్ షా ట్వీట్‌లో పరోక్షంగా వెల్లడించినట్లుగా ఉందని అంటున్నారు.