MS Dhoni: చచ్చీ చెడీ 103 పరుగులు చేసిన చెన్నై... అది కూడా సొంతగడ్డపై!

- ఐపీఎల్ లో ఇవాళ చెన్నై వర్సెస్ కోల్ కతా
- చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
- ఘోరంగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే ఆటగాళ్లు
చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ మారినా ఆటతీరు మారలేదు. ఇవాళ ధోనీ కెప్టెన్సీలో చెన్నై ఆటగాళ్లు మరీ దారుణంగా బ్యాటింగ్ చేశారు. కోల్ కతా నైట్ రైడర్స్ తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిన సీఎస్కే మొదట బ్యాటింగ్ చేసింది. అతి కష్టమ్మీద 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులు చేసింది. శివమ్ దూబే 31 (నాటౌట్) పరుగులతో ఆదుకోబట్టి ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. తొమ్మిదో స్థానంలో వచ్చిన ధోనీ కేవలం 1 పరుగు చేసి సునీల్ నరైన్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
మిడిలార్డర్ లో విజయ్ శంకర్ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (4), డెవాన్ కాన్వే (12) ఆరంభంలోనే వెనుదిరగ్గా, వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి 16 పరుగులు చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ (1), రవీంద్ర జడేజా (0), దీపక్ హుడా (0) ఘోరంగా ఆడారు. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 3, వరుణ్ చక్రవర్తి 2, హర్షిత్ రాణా 2, మొయిన్ అలీ, వైభవ్ అరోరా 1 వికెట్ తీశారు.
రెగ్యులర్ కెప్టెన్ రుతరాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఓ మోస్తరుగా ఆడిన చెన్నై ఆటగాళ్లు... ఇవాళ ధోనీ కెప్టెన్సీలో ఆడిన తీరు చూస్తే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎవరూ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు రాకుండా, మరీ 9వ స్థానంలో వచ్చి పేలవంగా అవుట్ కావడంపై సోషల్ మీడియాలో విమర్శలు ఊపందుకున్నాయి.