Telangana Government: గోదావరి-బనకచర్లపై ఏపీ ముందుకు వెళ్లకుండా చూడండి: జీఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

- గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ
- పోలవరం ప్రాజెక్టు, తాడిపూడి ఎత్తిపోతలపై టెండర్లు చేపట్టకుండా చూడాలని విజ్ఞప్తి
- ఈ నెల 7వ తేదీన జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించామని వెల్లడి
గోదావరి - బనకచర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా చూడాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు లేఖ రాసింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) కార్యాలయం జీఆర్ఎంబీకి లేఖను పంపింది.
పోలవరం ప్రాజెక్టు, తాడిపూడి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఎలాంటి టెండర్లు చేపట్టకుండా చూడాలని ఆ లేఖలో తెలంగాణ కోరింది.
ఈ నెల 7వ తేదీన జరిగిన సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించామని గుర్తు చేసింది. గోదావరి-బనకచర్ల ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని జీఆర్ఎంబీ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ సభ్యులు చెప్పారని గుర్తు చేసింది. అయితే మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని పేర్కొంది. కాబట్టి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను తక్షణమే నిలువరించాలని తెలంగాణ కోరింది.
గోదావరి-బనకచర్ల అనుసంధానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 16ను జారీ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీఆర్ఎంబీకి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీని కూడా లేఖకు జత చేసింది.