GHMC Commissioner: ఆస్తి పన్ను సమస్యలకు ఆరు నెలల్లో ఆన్‌లైన్‌లో పరిష్కారం: జీహెచ్ఎంసీ కమిషనర్

- ప్రజలు చెల్లించే ఆస్తి పన్నులో ప్రతి రూపాయికి న్యాయం చేస్తామన్న ఇలంబర్తి
- అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తామని వెల్లడి
- రూ. 3 వేల కోట్ల ఆస్తి పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడి
ఆస్తి పన్నుకు సంబంధించిన సమస్యలను ఆరు నెలల్లోనే ఆన్‌లైన్ ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. జీహెచ్ఎంసీకి ప్రజలు చెల్లించే ఆస్తి పన్నులో ప్రతి రూపాయికి సముచిత న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ రెవెన్యూ, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, బిల్ కలెక్టర్లను అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు.
అభివృద్ధి పనుల కోసమే ఆస్తి పన్నును వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ పరిధిలో రికార్డు స్థాయిలో రూ. 2 వేల కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలైన విషయాన్ని గుర్తు చేశారు.
నగరంలో చేపట్టిన జీఐఎస్ సర్వే ద్వారా 9 లక్షల ఆస్తుల సర్వే పూర్తయిందని, దీని ద్వారా ఆస్తి పన్ను వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 3 వేల కోట్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన వెల్లడించారు.