Chandrababu Naidu: కమనీయంగా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ మహోత్సవం... సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం సతీసమేతంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున ఆయన సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు.
అంతకుముందు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయ వర్గాలు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, తిరుమల ఆలయ ఈవో శ్యామలరావు, ఇతర అధికారుల స్వాగతం పలికారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి సంప్రదాయ దుస్తులు ధరించి ఈ ఆధ్యాత్మిక వేడుకకు విచ్చేశారు. అనంతరం ఆయనకు ఆలయ వేదపండితులు తలపాగా చుట్టారు. సీతారాముల పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని చంద్రబాబు దంపతులు ఆలయ ప్రదక్షిణలు చేశారు.
పట్టువస్త్రాల సమర్పణ అనంతరం చంద్రబాబు దంపతులకు అర్చక స్వాములు వేదాశీర్వచనం పలికి అక్షింతలు చల్లారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేకంగా రాముడు, సీత, లక్ష్మణుడితో కూడిన చిత్రపటాన్ని సీఎం దంపతులకు బహూకరించారు. ఈ కార్యక్రమాలు ముగిశాక చంద్రబాబు, నారా భువనేశ్వరి కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు.