Bihar: బీహార్‌లో అకాల వ‌ర్షాల బీభ‌త్సం.. 80 మంది మృతి!

80 Dead After Unseasonal Rains Pummel Bihar

  • బీహార్ రాష్ట్రాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న అకాల వ‌ర్షాలు 
  • మృతుల సంఖ్యపై మంత్రి విజ‌య్ కుమార్ ప్రకటన
  • మృతుల కుటుంబాల‌కు రూ. 4 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం 

అకాల వ‌ర్షాలు బీహార్ రాష్ట్రాన్ని అత‌లాకుత‌లం చేస్తున్నాయి. ఇప్ప‌టివ‌రకు 80 మంది మృతిచెందిన‌ట్టు ఆ రాష్ట్ర మంత్రి విజ‌య్ కుమార్ మండ‌ల్ శుక్ర‌వారం తెలిపారు. అక‌స్మాత్తుగా వ‌చ్చిన భారీ వ‌ర్షాలు, పిడుగుల వ‌ల్ల భారీగా ప్రాణ‌న‌ష్టం జ‌రిగింద‌ని చెప్పారు. అలాగే పంట‌ల‌కు కూడా అపార న‌ష్టం క‌లిగింద‌న్నారు. 

ప్రభుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని, బాధితుల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాల‌కు రూ. 4 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం అందిస్తున్నామని తెలిపారు. సీఎం నితీశ్ కుమార్ కూడా భారీ వ‌ర్షాల కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల ప‌ట్ల‌ విచారం వ్య‌క్తం చేశారు. 

అటు రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ నాయ‌కుడు, ప్ర‌తిప‌క్ష‌నేత తేజ‌స్వి యాద‌వ్ రాష్ట్రంలో అకాల వ‌ర్షాలు సృష్టిస్తున్న బీభ‌త్సంపై 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వం స‌రైన ప‌రిహారం అందించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. భారీ మొత్తంలో ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌డం తీవ్రంగా బాధించింద‌ని తేజ‌స్వి యాద‌వ్ పేర్కొన్నారు. 

ఆక‌స్మిక వ‌ర్షాల కార‌ణంగా గోదుమ రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని, గోదాముల‌లో దాచిన పంట కూడా నాశ‌న‌మైంద‌న్నారు. బాధిత రైతుల‌కు ప్ర‌భుత్వం త‌గిన ప‌రిహారం ఇవ్వాల‌ని, వారిని అన్ని విధాల ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు.  

Bihar
Bihar Unseasonal Rains
80 Deaths in Bihar
Bihar Floods
Vijay Kumar Mandal
Nitish Kumar
Tejashwi Yadav
Bihar Rainfall
Crop Damage in Bihar
India Floods
Unseasonal Rains India
  • Loading...

More Telugu News