Jogi Ramesh: ఏడాది తర్వాత రెడ్ బుక్ మడిచి ఎక్కడ పెట్టుకుంటారు?: జోగి రమేశ్

- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ విచారణకు హాజరయ్యానన్న జోగి రమేశ్
- చంద్రబాబు సీటు కోసం సొంత పుత్రుడు, దత్త పుత్రుడు పోటీ పడుతున్నారని ఎద్దేవా
- అక్రమ కేసులతో తనను భయపెట్టలేరని వ్యాఖ్య
తనపై అక్రమ కేసులు పెట్టి ఏదో సాధించాలనుకుంటున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా తమకు లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో సీఐడీ విచారణకు జోగి రమేశ్ ఈరోజు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ విచారణకు హాజరయ్యానని చెప్పారు. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గతంలో తమ పార్టీ అధ్యక్షుడు జగన్ ను ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యానించారని... ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లి నిరసన చేపట్టామని... అప్పుడు తనపైనే టీడీపీ శ్రేణులు దాడి చేశాయని, తన కార్లను ధ్వంసం చేశారని తెలిపారు. అక్రమ కేసులతో తనను భయపెట్టలేరని అన్నారు. సీఐడీ అధికారులు ఎప్పుడు విచారణకు రమ్మన్నా హాజరవుతానని చెప్పారు.
ఎన్నాళ్లు రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతారని జోగి ప్రశ్నించారు. ఏడాది తర్వాత రెడ్ బుక్ మడిచి ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరనే విషయం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. మంచి పాలన ఇస్తే ప్రజలు జై కొడతారని అన్నారు.
ఇటీవల ఒక సర్వే వచ్చిందని... ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కూటమిలోని 75 మందికి డిపాజిట్లు గల్లంతవుతాయని చెప్పారు. కడుపునిండా అన్నం పెట్టిన జగనన్నను వదిలి... పలావు పెడతానని చెప్పిన చంద్రబాబును నమ్మి ఓటేశామని 70 శాతం మంది ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. చంద్రబాబు కుర్చీ కోసం సొంత పుత్రుడు, దత్త పుత్రుడు పోటీ పడుతున్నారని చెప్పారు.